కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్@ తీన్మార్ మల్లన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలపై మళ్లీ ఏడుపులంకించుకున్నారు. కేవలం కమ్మ, రెడ్లపైనే కాదు వెలమ, వైశ్య కమ్యూనిటీలనూ వదిలిపెట్టలేదు. మొత్తంగా అగ్రవర్ణాలు టార్గెట్ గా ఆయన ఏకంగా మండలిలోనే తన ‘దుఃఖాన్ని వెళ్లగక్కారు. బీసీ వాదాన్ని వినిపించడం తప్పేమీ కాకపోవచ్చు.., కానీ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్న బడా వ్యాపార సంస్థలు తమకు లేవంటూ శాసన మండలి వేదికగా తన బాధను వ్యక్తం చేయడమే విచిత్రంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
ఇంకో అడుగు ముందుకేసీ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల్లోనూ తమవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రెండేళ్లపాటు ఆపారని న్యాయమూర్తులనూ నిందిస్తూ నిష్టూరమాడారు. తమలో మంత్రి లేడని, ముఖ్యమంత్రీ లేడని పదవీ కాంక్షను వెళ్లగక్కారు. మీడియా సంస్థల్లో 90 శాతం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయని ఆక్రోశించారు. టాప్ టెన్ న్యూస్ ఛానళ్లలో బీసీ యాంకర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫార్మా వంటి పారిశ్రామిక సంస్థల్లో తమ వారు లేరని, సినిమా రంగమూ తమ చేతుల్లో లేదని, ఫిల్మ్ స్టూడియోలూ అగ్రకులాలవారికే ఉన్నాయని, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణించలేకపోతున్నామని, చివరికి సినిమా నిర్మాతలు కూడా అగ్రవర్ణాలవారే ఉన్నారని పలువురి పేర్ల జాబితాను చదివారు. మెడికల్ కళాశాలలు, హోటళ్లు, పబ్బులు, కిమ్స్, అపోలో, కేర్ వంటి కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు తమకు లేవని మధనపడిపోయారు. శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా అగ్రవర్ణాలవారే నిర్వహిస్తున్నారని ఆందోళన చెందారు.
ప్రజా సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి వేదికగా ఎంచుకోవలసిన మండలిలో బీసీ వాదం పేరుతో తీన్మార్ మల్లన్న అగ్రవర్ణాలను నిందిస్తూ, నిష్ఠూరమాడుతూ, వారి సంస్థలను, వ్యాపారాలపై ఏడుపులంకించుకుంటూ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాసన మండలిలో నిన్న గాక మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన సుదీర్ఘ ప్రసంగంలోని ఆయా సారాంశానికి సంబంధించిన పూర్తి వీడియోను దిగువన గల లింక్ ద్వారా వీక్షించవచ్చు..