Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘తీన్మార్ డాన్స్’కు కాంగ్రెస్ మార్క్ శాస్తి!

కాంగ్రెస్ పార్టీని చాలా మంది రాజకీయ నాయకులు సముద్రంతో పోలుస్తుంటారు. ఈ సంద్రంలో ఈతరాని వారు సైతం ఆశ్యర్యకర రీతిలో రాజకీయంగా ఒడ్డుకు చేరుతుంటారు. గజ ఈతగాళ్లుగా పేరుగాంచిన కొందరు మాత్రం మధ్యలోనే మునిగిపోతుంటారు. కొత్తగా పార్టీలో చేరినవారు మంత్రులుగా మారవచ్చు.. దశాబ్ధాలుగా పార్టీనే నమ్ముకున్నవాళ్లు కనీసం పంచాయతీ వార్డు మెంబర్ ఛాన్స్ ను కూడా దక్కించుకోలేకపోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఎదగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే చెప్పాలి. ఇదే దశలో అనతికాలంలో ఎదిగినవారికి దక్కిన అదృష్టకర పార్టీగానూ అభివర్ణించడంలోనూ అతిశయోక్తి లేదు.

ఇందుకు దశాబ్దాల కాంగ్రెస్ చరిత్ర పేజీలను తిరగేయాల్సిన అవసరం లేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన తెలంగాణా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే చాలు ఈ విషయం బోధపడుతుంది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ కమ్ రాజకీయ నాయకుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ, ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రి హోదాకు ఎదిగారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగి ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వర్ రావు కూడా కాంగ్రెస్ లో చేరి మరోసారి మంత్రి అయ్యారు. ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న మల్లు భట్టి విక్రమార్క సైతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయా నాయకుల రాజకీయ నేపథ్యం, పరిస్థితుల ప్రభావం, రాష్ట్ర రాజకీయాల్లోని పరిణామాలు ఇందుకు దారి తీశాయనేది అందరికీ తెలిసిందే.

ఎమ్మెల్సీ మల్లన్నను సస్పెండ్ చేస్తూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ విడుదల చేసిన ఆదేశపు ప్రతి.

కానీ ఏ రాజకీయ అనుభవం లేకుండా తన యూ ట్యూబ్ లో నోరేసుకుని తన భాషా ‘సంస్కారం’తో జనం నోళ్లలో నాని ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన చింతపండు నవీన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో వేసిన ‘తీన్మార్’ డాన్స్ కు తగిన శిక్ష పడిందనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు ఆర్థికంగా చేయూతనందించినట్లు ప్రచారంలో గల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తన యూ ట్యూబ్ లో దుర్భాషలాడిన తీన్మార్ మల్లన్న వ్యవహారశైలిపై సహజమైన అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. పార్టీ పరువు పోరాదని, అభ్యర్థి గెలుపే ధ్యేయంగా కష్టపడిన జానారెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను తూలనాడడంలోనూ చింతపండు నవీన్ తన పోకడను భిన్నధోరణుల్లో ప్రదర్శించాడు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ తెలంగాణా రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం అంటూ కామెంట్ చేసే స్థాయికి మల్లన్న ‘తీన్మార్ డాన్స్’కు కాంగ్రెస్ పార్టీ విశాల వేదికగా మారింది. సీఎం హోదాలో గల కేసీఆర్ కు, ఆయన కుమారునికి, కూతురికి అభ్యంతకర ‘నిక్ నేమ్’లు పెట్టి కామెంట్లు చేయడంతో సంబరపడి దరిచేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఓ రకంగా మల్లన్న తన చేష్టలద్వారా తగిన గుణపాఠం నేర్పాడని చెప్పక తప్పదు.

కానీ ఇప్పుడేం జరిగింది..? సీఎం రేవంత్‘రెడ్డి’పై కామెంట్ చేసినా పార్టీ సీరియస్ గా తీసుకోలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస‘రెడ్డి’ని రాయలేని భాషలో దూషించినా పెద్దగా స్పందించలేదు. అపార రాజకీయ అనుభవం గల కుందూరు జానా‘రెడ్డి’ వంటి నాయకునిపై అపవాదు మోపినా ప్రశ్నించిన పాపాన పోలేదు. చివరికి కోమటి‘రెడ్డి’ వెంకట‘రెడ్డి’పై అడ్డగోలు వ్యాఖ్యలు చేసినా పార్టీపరంగా మల్లన్న తీరును వేలెత్తి చూపినవారు కనిపించలేదు. బహుషా కాంగ్రెస్ పార్టీలో గల అతి ప్రజాస్వామ్యపు అవకాశాన్ని చింతపండు నవీన్ అడ్వాంటేజిగా తీసుకుని ఉంటాడు. అందుకే కాబోలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు చెప్పుకున్న కులగణన సర్వే పత్రాలను తన యూ ట్యూబ్ ఛానల్ లైవ్ కార్యక్రమంలో నిప్పంటించి దహనం చేయడంలోనూ మల్లన్న సరికొత్త చర్చకు తెర లేపాడు. తనను ఏవరూ ఏమీ చేయలేరని, పైగా తాను ఢిల్లీతో కనెక్ట్ అయినట్లు కూడా మల్లన్న చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

కుల గణన సర్వే ఫారాన్ని తన యూ ట్యూబ్ లైవ్ ప్రసారాల్లో దహనం చేస్తున్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (షైల్)

ఆయా చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా మల్లన్న చేస్తున్న ‘తీన్మార్’ డాన్స్ వెనకాల పార్టీకి చెందిన నాయులెవరైనా ఉన్నారా? అనే సందేహంపైనా భిన్నవాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 5వ తేదీన ఎమ్మెల్సీ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వారంరోజుల వ్యవధినిస్తూ 12వ తేదీలోపు సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పార్టీ కోరింది. కానీ మల్లన్న స్పందించలేదు. పైగా తనకు షోకాజ్ నోటీస్ జారీ చేయడమంటే తెలంగాణా బీసీ సమాజానికి ఇచ్చినట్లుగా తనకు తాను అభివర్ణించుకున్నాడు. తన వాదనను, చర్యలను సమర్థించుకునే దిశగానూ కనీసం షోకాజ్ నోటీసుకు చింతపండు నవీన్ సంజాయిషీ ఇచ్చుకోలేదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలిపిన అభ్యర్థులకు వ్యతిరేకంగా తన కార్యకలాపాలను సాగించడం గమనార్హం.

మొత్తంగా తాను ఏరికోరి ఎమ్మెల్సీగా గెలిపించుకున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహించింది. ఎట్టకేలకు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సీఎం రేవంత్‘రెడ్డి’ని చివరి ఓసీ ముఖ్యమంత్రి అన్నందుకు కాదు, పొంగులేటి శ్రీనివాస‘రెడ్డి’ని బూతులతో దూషించినందుకుకాదు, జానా‘రెడ్డి’పై, కోమటి‘రెడ్డి’ వెంకట‘రెడ్డి’పై నోరు పారేసుకున్నందు కాదు.. ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ప్రతులను తగులబెట్టినందుకు పార్టీ మల్లన్నను సస్పెన్షన్ ద్వారా వెలి వేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే చెప్పారు. ‘రెడ్ల’పై నోరు పారేసుకున్నందు కాదు.. కుల గణన ప్రతులను తగులబెట్టినందుకే సస్పెండ్ చేశామన్నారు. మల్లన్నపై తీసుకున్న చర్య రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే జరిగిందని కూడా స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటివారైనా సహించేది లేదని క్లారిటీ ఇచ్చారు.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బహుషా తీన్మార్ మల్లన్న ఈ చర్యను ఊహించి ఉండకపోవచ్చు. షాక్ కు కూడా గురై ఉండవచ్చు. తనపై తీసుకున్న చర్యపై ఇప్పటి వరకు చింతపండు నవీన్ స్పందించలేదు. ఈ కథనం రాస్తున్న సమయానికి అంటే ఉదయం 9.00 గంటల ప్రాంతంలోనూ దినచర్యలో భాగంగా తన యూ ట్యూబ్ లైవ్ లోకి కూడా ఎమ్మెల్సీ మల్లన్న రాకపోవడం గమనార్హం. ఎమ్మెల్సీ హోదాలో గల చింతపండు నవీన్ పై పార్టీ తీసుకున్న చర్యవల్ల తేలిందేమిటంటే ఎవరేమన్నా ఉపేక్షించడానికి ఇది గత కాంగ్రెస్ కాదు.. అందుకు భిన్నమైన రీతిలో పయనిస్తున్న పార్టీ అని. చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న అనబడే ఎమ్మెల్సీ రాజకీయంగా ఇప్పుడు ఏ డాన్సయినా వేయవచ్చు. అయితే తాను ఇక వేయబోయే ‘తీన్మార్’ డాన్స్ కు స్టెప్ కలిపేవారు ఎంతమంది? మైనస్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా చూసినప్పుడు తన చర్యలకు వివిధ వర్గాల నుంచి లభించే స్పందనేమిటి? వంటి అనేక అంశాలపై నవీన్ కు తత్వం బోధపడవచ్చు. ఏది ఏమైనా అందివచ్చిన అవకాశంతో ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన ఓ యూ ట్యూబర్ రాజకీయ పోరాటం చివరికి విషాదంగానే ముగుస్తుందా..? చూడాలి మరి.

Popular Articles