Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘పల్లా’వారి ‘ప్రయివేట్’ లెక్క… ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటు పక్కా!

పల్లా రాజేశ్వర్ రెడ్డి… తెలంగాణా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని నాయకుడు. విద్యా సంస్థల నిర్వాహకునిగా, ఎమ్మెల్సీగా, రైతు బంధు సమితి చైర్మెన్ గా యావత్ తెలంగాణా సమాజానికి సుపరిచిత నేత. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లా గ్రాడ్యుయేట్స్ స్థానానికి ఆయన ఎమ్మెల్సీగా మరోసారి తలపడనున్నారు. గతంలోనూ ఇదే స్థానం నుంచి పల్లా ఎమ్మెల్సీగా విజయం సాధించారు త్వరలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఈసారి పోటీకి పల్లా రాజేశ్వర్ రెడ్డి సుముఖంగా లేరనే ప్రచారం గతంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలకు చెందిన ‘టీ న్యూస్’ ఇన్ పుట్ ఎడిటర్ పీవీ శ్రీనివాస్ అధికార పార్టీ టికెట్ పై ఆశతో పోటీ చేయాలని భావించారు. ఈమేరకు ఒకటీ, అరా సమావేశాలు కూడా నిర్వహించారు. ఎందుకోగాని ఆ తర్వాత పీవీ శ్రీనివాస్ సెట్ బ్యాక్ అయ్యారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి రాసిన వ్యాసం

పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. దాదాపు ఆయనే గులాబీ పార్టీ అధికారిక అభ్యర్థిగా తేలిపోయింది. ఈమేరకు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన స్వయంగా పాల్గొంటున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కరదీపిక ‘నమస్తే తెలంగాణా’ పత్రికలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ సుదీర్ఘ వ్యాసం రాశారు. బుధవారం నాటి సంచికలోని ఎటిటోరియల్ పేజీలో ఇది ప్రచురితమైంది. ఈ వ్యాసంలో అనేక అంశాలను పల్లా ప్రస్తావించారు. ముఖ్యంగా గడచిన ఆరేళ్లలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీని ఏకరవు పెట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల అంశాలో ప్రభుత్వ పురోగతిని పూసగుచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల నియామకాలను అంకెలవారీగా వెల్లడించారు. శాఖల వారీగా లెక్కలు చెప్పారు. ప్రభుత్వ పాలసీ, పరిశ్రమల ఏర్పాటు, తద్వారా లభించిన ఉద్యోగాలను ఉటంకించారు. ‘పెట్టుబడులతో ఉద్యోగాలు’గా ప్రస్తావిస్తూ, పలు ప్రయివేట్ సంస్థలను సైతం పల్లా తన వ్యాసంలో పొందుపర్చారు. ‘ఐకియా’ నుంచి కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలను కూడా పల్లా వదలకపోవడమే విశేషం. ఈ అంశంలో ఆయనేమంటారంటే…

‘‘తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో ఉత్పత్తులను, కార్యకలాపాలను నిర్వహిస్తుండటంతో ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన కరంటు లభ్యత, సమశీతోష్ణ వాతావరణం, కావాల్సినంత భూమి, అద్భుతమైన శాంతిభద్రతల వ్యవస్థ వంటి మౌలిక వసతులు ఇందుకు కారణాలు. ఇలా లభించే ఉపాధి అవకాశాలనూ సర్కారు కల్పించిన అవకాశాలుగానే లెక్కించాల్సి ఉంటుంది. ఐటీ, ఐటీ అనుబంధం, ఇతర రంగాల పరిశ్రమలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించడంతో 2014 తర్వాత ఏకంగా 16,70,639 మంది ఉద్యోగాలు పొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక సంస్థలు మన రాష్ట్రానికి వచ్చాయి. స్వీడన్‌కు చెందిన ఐకియా తమ శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. రూ.900 కోట్లతో మెదక్‌ జిల్లాలో ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ తమ కార్యకలాపాలను విస్తరించింది. వాల్‌ మార్ట్‌ సుమారు రూ.750 కోట్లతో తమ శాఖను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌ తమ అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ను ప్రారంభించింది. మొబైలు ఫోన్‌ తయారీదారు వన్‌ ప్లస్‌ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఫెర్రింగ్‌ ల్యాబోరేటరీస్‌ జీనోమ్‌ వ్యాలీలో రూ.235 కోట్లతో కార్యకలాపాలు మొదలుపెట్టింది. నోవార్టీస్‌ తమ నాలెడ్జ్‌ సెంటర్‌ను హైదరాబాదులో ఏర్పాటు చేసింది. పరిశోధన, అభివృద్ధి సంస్థలు, అంకుర పరిశ్రమల కోసం ఎంఎం పార్క్‌ రూ.వెయ్యి కోట్లతో రెండో దశ ఐటీ హబ్‌ను 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిద్ధం చేసింది. బోయింగ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఉమ్మడిగా హెలికాప్టర్‌ పైభాగాల తయారీ కర్మాగారాన్ని స్థాపించాయి. కల్యాణి రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ క్షిపణి ఉప-వ్యవస్థ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. మెడ్‌ ట్రానిక్‌ సంస్థ రూ.1200 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 19 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫార్మా సిటీ ప్రపంచపు అతిపెద్ద సమీకృత ఫార్మా వ్యవస్థ. రూ.70వేల కోట్ల పెట్టుబడులు, 5,60,000 మందికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. భారతదేశపు మొదటి, అతిపెద్ద జీవశాస్త్ర ఉత్పత్తుల తయారీ సముదాయంగా జీనోమ్‌ వ్యాలీ ఉంది. సుమారు 150 సంస్థలు, 10 వేల ఉద్యోగులతో నడుస్తున్నది. ప్రసిద్ధ వ్యాక్సిన్‌, పరిశోధన సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. వీటిలో మన యువత ఉద్యోగాలు పొందారు.’’

ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఇలా సాగింది పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాసం. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే… సర్కారు శాఖల్లోని కొలువులనే కాదు, ప్రభుత్వం కల్పించిన మౌళిక వసతుల వల్ల వచ్చిన ప్రయివేట్ సంస్థల్లో లభించిన ఉద్యోగాలను కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాలుగానే భావించాలనేది ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చెబుతున్న సరికొత్త భాష్యం. ఈ సత్యాన్ని గ్రహించిన ఏ గ్రాడ్యుయేట్ అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘పల్లా’కు ఓటు వేయవలసిందేనని రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య. అదీ అసలు సంగతి.

Popular Articles