బతుకమ్మ వేడుకల్లో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒకింత భావోద్వేగానికి కూడా గురయ్యారు. సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, చింతమడక గ్రామం చరిత్రాత్మక గ్రామమని, కేసీఆర్ ఇక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. చింతమడక, సిద్ధిపేట్లో కేజీఎఫ్ తరహాలో ఆంక్షలు విధించారని, ఇటువంటి ఆంక్షలను కొనసాగిస్తే ఇంకా ఎక్కువసార్లు వస్తానని అన్నారు. చింతమడక తన జన్మభూమిగా పేర్కొంటూ భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చని కవిత వ్యాఖ్యానించారు. ‘మనం తెలంగాణోళ్లం.. ఎవరికీ భయపడం.. చింతమడకకొస్తా.. సిద్ధిపేటకొస్తా.. ఒక్కసారి కాదు మల్ల..మల్లొస్తం.. ఆంక్షలు పెడితే ఎక్కువసార్లు ఒస్తం’ అని కవిత అన్నారు.

చింతమడక ప్రజలు కేసీఆర్ ను చంద్రునిగా, చంద్రం సారుగా పిలుస్తారని, అటువంటి చంద్రునికి మచ్చ తెచ్చారని, తాను ఈ విషయాన్ని చెప్పగానే తల్లిని, పిల్లను ఎడబాపిండ్రని, ప్రస్లుతం తాను బాధలో ఉన్నానని, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నానని, కుటుంబానికి దూరం చేశారనే బాధలో ఉన్నానని కవిత చెప్పుకొచ్చారు. దుఃఖంలో వెంట ఉన్నవాళ్లే నిజమైన స్నేహితులని, కుట్రలు చేసి కుటుంబం నుంచి తనను వేరు చేసినవారిని వదిలిపెట్టబోనని అన్నారు. ఏ ఊరు కూడా ఎవరి అయ్య జాగీరు కాదని, జాగీర్ లాగా వ్యవహరిస్తున్నవారి భరతం భవిష్యత్తులో పడతానని కవిత హెచ్చరించారు. అయితే ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే ఎవరిని ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారనే అంశంపై రాజకీయంగా భిన్న చర్చ జరుగుతోంది.

