బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్రమేణా దూరమవుతున్నట్టేనా? ఎల్కతుర్తి సభ తర్వాత తాను తన ‘డాడీ’కి రాసిన లేఖ లీక్ పరిణామాలపై కవిత చేసిన వ్యాఖ్యల అనంతరం గులాబీ పార్టీ కేడర్ లో అయోమయ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తన తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని గత మే 24వ తేదీన అమెరికా నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ కవిత వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు వెడుతున్న కేసీఆర్ ను కలిసేందుకు కవిత ఎర్రవల్లి ఫాం హౌజ్ కు వెళ్లారు. కానీ తాను ఫాం హౌజ్ నుంచి బయలుదేరుతున్న సమయంలో పక్కనే గల కూతురు కవిత మొహం కూడా చూడకుండా కేసీఆర్ వెళ్లిపోయిన దృశ్యం బీఆర్ఎస్ పార్టీ కేడర్ కళ్లముందు కదలాడుతూనే ఉంది.
ఆయా పరిణామాల అనంతరం ఎమ్మెల్సీ శింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీశాయి. మల్లన్న వ్యాఖ్యలపై ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ ఆఫీసుపై నాలుగు రోజుల క్రితం దాడి చేశారు. ఈ సందర్భంగా మల్లన్న గన్ మెన్లు కాల్పులు జరిపిన తీరు తీవ్ర ఉద్రికత్తకు దారి తీసింది. పోలీసులు అటు తీన్మార్ మల్లన్నపై, ఇటు కల్వకుంట్ల కవితపై కేసులు నమోదు చేశారు. కాల్పులు జరిపిన గన్ మెన్లను సిటీ ఆర్ముడ్ రిజర్వు కమాండెంట్ కు సరెండర్ చేశారు. అయితే ఈ ఉదంతంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులెవరూ కవితకు మద్ధతుగా నిలవకపోవడం గమనార్హం.

పార్టీ చీఫ్, తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వంటి ముఖ్యనేతలే కాదు గులాబీ పార్టీకి చెందిన ఇతర నాయకులెవరూ కవితకు అండగా నిలవలేదు. మధుసూదనాచారి మాత్రం స్పందించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి నుంచి కవితను నిన్న తొలగించారు. ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ ను ఇంఛార్జిగా నియమించారు. తనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు, అనంతర పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత గురువారం స్పందించడం విశేషం. ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదన్నారు. ఈ అంశాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులను ఉద్ధేశించి కవిత వ్యాఖ్యానించారు.

అదేవిధంగా తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం ఇంచార్జిగా కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా సింగరేణి కార్మికుడని, సింగరేణిపై కొప్పుల ఈశ్వర్ కు పూర్తి అవగాహన ఉందని, జగిత్యాల జిల్లా పెద్దన్నగా ఈశ్వర్ ను పిలుచుకుంటామని చెప్పారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నకు సమాధానంగా ‘రేవంత్ రెడ్డి కేబినెట్ లో నేను చేరుతానని ఒక ఎమ్మెల్సీ(తీర్మార్ మల్లన్న) చేసిన కామెంట్స్ పై నేను స్పందించను. ఆ ఎమ్మెల్సీని జనాభా లెక్కల నుంచి తీసేశాం’ అని కల్వకుంట్ల కవిత అనూహ్య వ్యాఖ్య చేశారు. కాగా బీసీ రిజర్వేషన్లు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టేనని కవిత వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారని, అది తప్పు అని, బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సిందేనని, నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో, అంతే.. అని కవిత వ్యాఖ్యానించారు. మొత్తంగా కవిత తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఘర్షణాత్మక రీతిలో కాకుండా రాజకీయ ‘విజ్ఞత’తో ‘డాడీ’ పార్టీకి దూరమవుతున్నట్లేనా? అనే ప్రశ్న ప్రామాణికంగా గులాబీ కేడర్ లో పెద్ద చర్చే జరుగుతోంది.