Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

లేఖ నాదే.. డాడీ దేవుడు: కల్వకుంట్ల కవిత క్లారిటీ!

హమ్మయ్య.. కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. తన డాడీకి రాసిన లేఖ తన దస్తూరేనని ఒప్పుకున్నారు. గతంలో కూడా ఇటువంటి లేఖలు అనేకం రాశానని చెప్పారు. కానీ తాజాగా రెండు వారాల క్రితం రాసిన లేఖ ఇప్పుడెలా బయటకు వచ్చిందో తెలియాల్సిన అవసరముందన్నారు. రహస్యంగా రాసిన లేఖ బయలకు ‘లీక్’ ఎలా అయ్యింది? అంటూ ప్రశ్నించారు. కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు.

తన తండ్రి దేవుడని చెప్పారు. కాకపోతే ఆ దేవుని చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని సెలవిచ్చారు. డాడీ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకు వెడుతుందన్నారు. డాడీకి లేఖ రాయడంలో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని తేల్చేశారు. పార్టీ శ్రేయస్సు కోసమే ఉత్తరం రాసినట్లు చెప్పారు. మొత్తంగా తాను సీక్రెట్ గా రాసిన లేఖ ఎందుకు లీకయ్యింది? ఎలా లీకయ్యింది? తాను రాసిన లేఖ లీక్ అయితే పార్టీలో సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటని కూడా కవిత ప్రశ్నించారు. ఆ కుట్రదారుడు ఎవరో తెలియాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పార్టీలోని వ్యక్తులే లెటర్ లీక్ చేశారని, కుటుంబం, పార్టీ ఐక్యంగానే ఉన్నాయని, తమ నాయకుడు కేసీఆరేనని, ఎలాంటి ఇతర ఆలోచన లేదని కవిత కుండబద్దలు కొట్టారు.

మొత్తంగా కవిత రాసిన లేఖపై ఇప్పటి వరకు ఉన్న సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఎటువంటి లెటర్ హెడ్ లేకుండా, ఓ తెల్ల కాగితంపై రాసినట్లు గల లేఖ పేజీలపై భిన్నవాదనలు వినిపించాయి. కానీ ఆ లేఖ తానే రాసినట్లు కవిత వెల్లడించడంతో భిన్నాభిప్రాయాలకు ఫుల్ స్టాప్ పడినట్లే భావించవచ్చు. కానీ అమెరికా నుంచి తిరిగొచ్చాక శుక్రవారం రాత్రి ఎయిర్ పోర్టులో కవిత మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ను దేవునిగా అభివర్ణించారు. అదే సమయంలో ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ చుట్టూ గల దెయ్యాలు ఎవరు? అనేది ఇప్పుడు గులాబీ పార్టీ కేడర్ లో జరుగుతున్న భారీ చర్చ.

ఎమ్మెల్సీ కవిత

కవిత దయ్యాలుగా ప్రస్తావించిన వ్యక్తులెవరు? కవిత ఎవరిని ఉద్దేశించి దయ్యాలు.. అనే పదాన్ని వాడారు? కవిత తన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఉద్ధేశించి ఆ పదాన్ని వాడారా? లేక బంధువుల గురించి ఉటంకించారా? పార్టీకి చెందిన ఎవరైనా ఇతర నాయకులను దయ్యాలుగా పేర్కొన్నారా? అనే ప్రశ్నలపై భిన్న కోణాల్లో చర్చ సాగుతోంది. ఒకే పార్టీలో గల ఓ తండ్రికి కూతురు లేఖ రాయడమే విచిత్రమని, లేఖ లీకైన తర్వాత తన తండ్రి దేవుడని పేర్కొంటూ, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయనడంలో అసలు ఆంతర్యమేంటనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లోనే సాగుతుండడం విశేషం. ‘దయ్యాలు’ పద ప్రయోగం ద్వారా పార్టీలో ఎవరిని బలి చేస్తారనే ప్రశ్నను కూడా బీఆర్ఎస్ వర్గాలు సంధిస్తుండడం కొసమెరుపు.

Popular Articles