Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

కామ్రేడ్ కల్వకుంట్ల కవితక్క @ మేడే

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన సంతానం విషయంలో చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. చాలా మంది రాజకీయ నాయకుల సంతానం ‘పండిత పుత్ర.. పరమ శుంఠ’ సామెత తరహాలో వ్యవహరిస్తూ సాక్షాత్కరిస్తుంటారు. కానీ వేలాది పుస్తకాలను పఠించి, తన మేథాశక్తితో తెలంగాణా ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకువెళ్లి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించిన కేసీఆర్ తనయుడడు కేటీఆరే కాదు, తనయ కవిత సైతం సందర్భోచిత ప్రసంగం చేయడంలో దిట్టలనే విషయాన్ని అంగీకరించక తప్పదు. సమయం, సందర్భం, వేదిక, కార్యక్రమం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఆద్యంతం ఆకట్టుకునే ప్రసంగం చేయడంలో కేటీఆర్ మాత్రమే కాదు, ఎమ్మెల్సీ కవిత సైతం నిష్టాతులనే విషయం మరోసారి రుజువైంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రసంగంలో చేసే పరుష వ్యాఖ్యలు, పద ప్రయోగం అనేక సందర్భాల్లో విమర్శలకు తావు కల్పించిన సంగతి తెలిసిందే. కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం తన ప్రసంగంలో విమర్శలకు తావు కల్పించే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన ఉదంతాలు తక్కువేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటుంటారు. నిన్న మేడే ఉత్సవాల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత అచ్చు గుద్దినట్లుగా ‘కామ్రేడ్లు’ వాడే సహజ భాషను ఉపయోగించి చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడం విశేషం. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, నక్సలైట్లను చర్చలకు పిలవాలని, వాళ్లేం మాట్లాడుతారో వినాలని బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మిలట్రీ ఉందని, బలముందని సంపుకుంట పోవుడు ప్రజాస్వామ్యం కాదని విప్లవ కారులకు కేసీఆర్ బాసటగా నిలిచారు.

మేడే ఉత్సవాల్లో పాల్గొన్న కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కార్మిక శక్తిని కొనియాడుతూ ఆద్యంతం ‘విప్లవ’ భాషలో మాట్లాడడం విశేషం. ఆమె తన ప్రసంగంలో నియంతలైన ఇటలీకి చెందిన ముస్సోలినీ గురించి, హిట్లర్ గురించి కూడా ప్రస్తావించారు. నియంతలకు వ్యతిరేకంగా పోరాడడంలో కార్మికులు మేడేను ఎంచుకున్నారని చెప్పారు. మనదేశంలో కార్మిక చట్టాలు అనేకంగా ఉండేవని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దన్నుగా ఉండే నైజంతో ఆయా చట్టాలను కాలరాశాయని కవిత అన్నారు.

సమాజంలోని అసమానతలపై ఓ తల్లిగా, చెల్లిగా, సోదరిగా, మహిళగా తాను చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం కింద ఎకరం భూమి గల రైతుకు ఏటా రూ. 10 వేలు, పదెకరాల ఆసామికి రూ. లక్ష చొప్పున ఇచ్చామని, కానీ ఏ భూమీ లేని కార్మికునికి మాత్రం మనం ఇంకా కూడా ఏమిచ్చుకోలేదని కవిత బాధపడ్డారు. రేపటి తెలంగాణాలో భూమి ఉన్నా, లేకున్నా, కార్మికుడైనా, చిరుద్యోగి అయినా ప్రభుత్వం ఆదుకునే దిశగా మన ప్రయాణం సాగాలని, ఇది తన కలగా కవిత వెల్లడించారు.

ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేసినప్పటి చిత్రం

భౌగోళిక తెలంగాణా తెచ్చుకున్నామని, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే ‘సామాజిక తెలంగాణా’ను మనం సాధించుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. ఇవ్వాళ, రేపటి తెలంగాణాలో అవసరమైతే మరో తెలంగాణా ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని, మేడేను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరికి కూడా సమసమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సిన అవసరముందని కవిత అభిప్రాయపడ్డారు.

ఇదే సందర్భంగా తెలంగాణాలోని వివిధ జిల్లాలోగల తలసరి ఆదాయంలో గల వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 8 లక్షలు కాగా, పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో గల వికారాబాద్ జిల్లాలో రూ. 1.58 లక్షల తలసరి ఆదాయముందని బేరీజు వేశారు. ‘మేడ ఉంటుంది.. మేడ ముందు మురికివాడ’ ఉంటుంది అంటూ ఓ గాయకుడు పాడిన పాటను ప్రస్తావిస్తూ సమాజంలోని అంతరాలను, అసమానతలను ఆమె గుర్తు చేశారు. మేడే స్ఫూర్తిగా చేసే పోరాటాలతో రేపటి తెలంగాణాలో ఇటువంటి అసమానతలు తొలగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మేడే వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత ఆసక్తికర ప్రసంగాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు.

Popular Articles