ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణాలోని మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల స్థానాలకు, ఖమ్మం-వరంగల్-నల్లగొండ టీచర్స్ నియోజకవర్గ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అటు ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి-కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు, శ్రీకాకుళం-విశాఖ-విజయనగరం జిల్లాల టీచర్స్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.