మిస్ వరల్డ్ క్రిస్టినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. చెక్ రిపబ్లిక్ మోడల్, మిస్ వరల్డ్ 2023గా ఎంపికైన క్రిస్టినా పిష్కోవా మే 7 నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2024 పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 20న నిర్వహించనున్న ప్రి లాంచ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ లో వచ్చారు. హైదరాబాద్ లోని చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్, చౌమొహల్లా ప్యాలెస్, గోల్కొండ లను సందర్శించనున్నట్లు క్రిస్టినా తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఆమె యాదగిరిగుట్టకు వెళ్లి భారతీయ సాంప్రదాయ చీరకట్టులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన 120 మంది అందాల భామలు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారని టూరిజం కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలిపారు. క్రిస్టినా ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సందర్శించుకుని, దేవాలయ ఆధ్యాత్మిక సౌందర్య సంపద చూసి అచ్చెరువొందారని ఆమె చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని స్మిత సభర్వాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.