(సమీక్ష ప్రత్యేకం)
మణిపూర్ రాష్ట్రం Tamenglong జిల్లాలోని ఇంపా (Impa) అనే కుగ్రామం దట్టమైన అడవిలో ఓ మూల విసిరేసినట్టు ఉంటుంది. అక్కడికి కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేవు. కాలి బాటలను అనుసరిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. నాలుగైదు కిలోమీటర్లకు ఓ వాగో, నదో అడ్డంగా ప్రవహిస్తూ ఇంపా గ్రామాన్ని మిగతా ప్రపంచంతో దూరంగా ఉంచింది. పక్కా రోడ్డు కోసం గ్రామస్తులు ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా రూ.100 కోట్లు ఖర్చవుతుందని చేతులెత్తేసింది.
అయితే 2012లో ఇంపా గ్రామం దశ తిరిగే పరిణామం చోటు చేసుకుంది. 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఇంపా గ్రామస్తుడు అయిన ఆర్మ్ స్ట్రాంగ్ పామె (Armstrong Pame) ఆ ప్రాంతానికి సబ్ కలెక్టర్ గా మొదటి పోస్టింగులో చేరాడు. ప్రభుత్వ నిధుల కొరతను అర్థం చేసుకున్న పామె రహదారి నిర్మాణంతో ప్రయోజనం పొందే గ్రామాల పెద్దలను కలిసాడు. ఫేస్బుక్ లో క్రౌడ్ ఫండింగ్ కు అభ్యర్థనలు పెట్టాడు. తమ కుటుంబం, తన జీతం నుంచి పది లక్షల దాకా అందజేసాడు. రోడ్డుకు అవసరమైన రూ.40 కోట్లు నిధులు సమకూరాయి.

డోజర్లు, ఎర్త్ మూవర్లతో కలిసి వేలాది మంది ఆదివాసి ప్రజలు రోడ్డు నిర్మాణంలో పాల్గొన్నారు. రెండేళ్లలో అసాధ్యమనకున్న 100 కి.మీ. రహదారి పూర్తయింది. ఈ వార్త దేశమంతా వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం దానిని జాతీయ రహదారిగా ప్రకటించి మరింత అభివృద్ధి చేసింది. ఇప్పుడది నాగాలాండ్, అస్సాం హైవేలతో కలిసి ఈశాన్య రాష్ట్రాలు మొత్తానికి కనెక్ట్ అయింది.

విరాళాలు, ప్రజల సహకారంతో 100 కి.మీ. రోడ్డును నిర్మించిన ఆర్మ్ స్ట్రాంగ్ పామె చొరవ, ఆరాటాలు ఆయనకు ఎక్కడలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘మిరాకిల్ మ్యాన్’ అని పిలవడం మొదలుపెట్టారు. పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఢిల్లీ పనిచేస్తున్నా తన కలను సాకారం చేసుకున్న తీరును విద్యార్థులకు వివరించాలని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఆహ్వానాలు పలుకుతున్నాయి.

✍️ బి.టి. గోవిందరెడ్డి
(ఫోటోలో ఆర్మ్ స్ట్రాంగ్ పామె, ఆయన సతీమణి యిని ఎవెలిన్ -Yini Evelyn)

