హైదరాబాద్: తుపాన్ కారణంగా కురిసే అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి పత్తి, ధాన్యం, మొక్క వంటి పంటల కొనుగోలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల పాటు తుపాన్ ప్రభావంతో మన రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాల్లో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల వద్ద వర్షాల కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేరకు టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేయాలన్నారు. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వంద శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో మౌళిక వసతుల కొరత ఎక్కడైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సజావుగా కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. పంట కొనుగోలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సివిల్ సప్లై కమిషనర్ దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. పంట కొనుగోలు విషయంలో చిన్న తప్పు, అక్రమాలకు కూడా ఆస్కారం లేదని, ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తుపాన్ ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తూర్పు తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట కోతలు వాయిదా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కోతలు చేసిన మొక్కజొన్న, వరి వంటి పంటలు నాణ్యతా ప్రమాణాలు ఉంటే వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని, పంట తరలింపుకు వాహనాల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెట్ కు చేరిన పంట అకాల వర్షాలకు తడవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలలో సోయాబీన్ పంటను కొనుగోలుకు సైతం కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత కలెక్టర్లకు మంత్రి సూచించారు.
వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతుల కల్లాల వద్ద తేమ శాతం పరిశీలించి నాణ్యత ప్రమాణాలు ఉంటేనే కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకుని వచ్చేలా చూడాలన్నారు. రైతులకు నష్టం కలగవద్దని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని, బోర్డర్ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పంట అమ్ముకోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటలను రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం మద్దతు ధర అందించి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుందన్నారు. రాబోయే 45 రోజుల నుంచి 2 నెలల కాలంలో ధాన్యం కొనుగోలు ఉధృతంగా జరగనున్నదని, అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సజావుగా కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు ఏపిలో వస్తున్న తుపాన్ ప్రభావం మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలపై అధికంగా పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద పంట నష్టం కాకుండా జాగ్రత్త పడాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు.

