Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ కసరత్తు

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఉద్యుక్తమవుతోంది. ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై మంత్రుల కమిటీ ఆదివారం సాయంత్రం ప్ర‌జాభ‌వ‌న్ లో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై కసరత్తు చేసింది.

రాష్ట్రంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గ‌ణ‌న‌ చేపట్టిటనట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా చెప్పారు. ఈ విష‌యంపై ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు వాగ్దానం కూడా చేశారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఓబీసీ కులగణ‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా చేపట్టిన‌ట్లు మంత్రుల క‌మిటీ తెలిపింది. సోషియో, ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వేలో వచ్చిన ఎంపీరికల్ డాటాను శాసనసభలో ప్రవేశపెట్టి, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభలో పెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపినట్లు కమిటీ పేర్కొంది.ఆ బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్ళిందని, ప్రస్తుతం రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద 5 నెల‌లుగా పెండింగ్ లో ఉందని, మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని మంత్రుల కమిటీ వివరించింది.

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా సలహా ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయం కోరినట్లు మంత్రుల కమిటీ తెలిపింది. ఇదే అంశంపై సోమవారం జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం సైతం తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు పాల్గొన్నారు. కమిటీ సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లో అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Popular Articles