Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

రేవంత్ సర్కారుపై మంత్రి వివేక్ మీడియా సంచలన కథనం

V6 News ఛానల్ తెలుసు కదా? ఈ శాటిలైట్ ఛానల్ కు యూ ట్యూబ్ లో 1.15 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. శాటిలైట్ వార్తా ఛానళ్లలో నెంబర్ గేముల్లో గల ప్రఖ్యాత న్యూస్ ఛానళ్లను మించి డిజిటల్ మీడియాలో సబ్ స్క్రైబర్లు గల V6 Newsకు అనుంబంధంగా ‘ప్రభాత వెలుగు’ అనే దినపత్రిక కూడా ఉంది. ఈ పత్రిక మాస్ట్ హెడ్ లో మాత్రం ‘ప్రభాత’ అనే అక్షరాలు చిన్నగా, ‘వెలుగు’ అక్షరాలు పెద్దవిగా ఉంటాయనేది వేరే విషయం. పాఠకుల వ్యవహారికంలో దీన్ని వెలుగు పత్రికగా సంబోధిస్తుంటారు. ఇదే సంస్థకు V6 News తరపున ‘డిజిటల్’ ఎడిషన్ కూడా ఉంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో V6 News తన డిజిటల్ ఎడిషన్ల ద్వారా పాఠకులకు మాంచి ఆసక్తికర వార్తా కథనాలను అందిస్తుంటుంది.

V6 News మంగళవారంనాటి సాయంత్రం 5 గంటల డిజిటల్ ఎడిషన్ లో ఇటువంటి ఆసక్తికర కథనమే ఒకటి కనిపించింది. ‘కవిత వెనుక ఎవరు? అనే శీర్షికతో మల్లన్న ఆఫీస్ పై దాడి తర్వాత కొత్త చర్చ, సొంత ఫ్యామిలీ సహా గులాబీ పార్టీ సైలెంట్, మల్లన్న తీరు మీదే హస్తం లీడర్ల వ్యాఖ్యలు, బీఆర్ఎస్ కు లేని బాధ వీళ్లకెందుకున్న చర్చ, కవితను హైలైట్ చేస్తున్నారనే అనుమానాలు’ అనే వాక్యాలతో కూడి బ్లర్బులతో బ్యానర్ స్టోరీని ప్రచురించారు. ‘ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన నేపథ్యంలో V6 News డిజిటల్ ఎడిషన్ ఈ వార్తా కథనాన్ని ప్రచురించింది ఈ కథనంలో V6 News డిజిటల్ ఎడిషన్ ప్రస్తావించిన సారాంశంలోకి వెడితే..

‘కాంగ్రెస్ నేతలు కవితపై మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తే ఆమె సొంత పార్టీ నుంచి కవితకు పెద్దగా స్పందన రాలేదు. పేపర్లలో వచ్చే ప్రతీ వార్త మీద పోస్టులు పెట్టే కేటీఆర్, హరీష్ రావులు సొంత పార్టీ, సొంత కుటుంబానికి చెందిన మహిళా నేత మీద మాత్రం సైలెంటయ్యారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి సిటీలోనే నందినగర్ లో గల కవిత తండ్రి కేసీఆర్ కూడా దీనిపై కనీసం స్పందించలేదు. పార్టీ సైలెంట్ పై విమర్శలు రావడంతో రాత్రికి రాత్రి హడావిడిగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ కాంగ్రెస్ లోని బీసీ నాయకులు మాత్రం మల్లన్న వ్యాఖ్యలు పానాలు పోయే మాటగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. సొంత పార్టీ, సొంత కుటుంబమే పట్టించుకోని అంశంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు ఇంతగా స్పందించారన్నది రకరకాల ఊహాగానాలకు దారి తీసింది.’ అంటూ సాగిన వార్తా కథనంలో V6 News డిజిటల్ పలు ప్రశ్నలను కూడా సంధించింది.

‘కొందరు కాంగ్రెస్ నేతలు పదే పదే కవిత పేరునే ప్రస్తావిస్తూ విమర్శలు చేశారని, నిజానికి బీఆర్ఎస్, బీజేపీకంటే కవిత ప్రస్తావననే ఎక్కువగా చేశారని, దీంతో కవిత వెనుక ఎవరైనా బలమైన నేత ఉన్నారా? ఆమెకు ముందే సమాచారం అందుతోందా? అందుకే ఆమెకు అవసరం లేకున్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? అన్న అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్లయింది’ అని V6 News డిజిటల్ ఎడిషన్ తన కథనంలో పేర్కొంది.

అంతేకాదు ‘తీన్మార్ మల్లన్న మొదటి నుంచీ బీసీ వాదాన్ని వినిపిస్తున్నారు. పార్టీలకతీతంగా బీసీ నేతలను జమ చేసి సభలు, రౌండ్ టేబుల్ మీటింగులు నిర్వహించారు. బీసీ కులాలన్నీ ఒక్కటిగా పని చేయాలంటూ ఆయా కుల సంఘాలను ఒక వేదిక మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో మొదలైన మల్లన్న కార్యాచరణ ప్రభుత్వం మారాక, తను ఎమ్మెల్సీ అయ్యాక కూడా కొనసాగిస్తూ వస్తున్నారు’ అని V6 News డిజిటల్ ఎడిషన్ పేర్కొంది.

‘మహాటీవీ ఆఫీసుపై దాడి జరిగిన గంట వ్యవధిలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి పరామర్శించారు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా మహాటీవీపై దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. క్యూ న్యూస్ ఆఫీసుపై అంతకన్నా పెద్ద దాడే జరిగింది. గన్మెన్లు కాల్పులు జరిపేదాకా వెళ్లింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేసి గాయపర్చారు. ఆఫీసంతా రక్తసిక్తమైంది. ఇంత జరిగినా తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడికి పాల్పడ్డ జాగృతి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించలేదు. తమ పార్టీ తరపున గెలిచిన తీన్మార్ మల్లన్నను పరామర్శించలేదు. పైగా ఆయన గన్ మెన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఈ పరిణామాలన్నీ అనేక అనుమానాలు తావిస్తున్నాయి’ అని V6 News డిజిటల్ తన వార్తా కథనంలో మధనపడింది.

ఇలా సాగిన V6 News డిజిటల్ ఎడిషన్ లోని కథనంలో ఉటంకించిన పరిభాషా ప్రకారమే ‘కలుగుతున్న అనుమానాలు, రాజకీయంగా తెలంగాణాలో జరుగుతున్న చర్చ’ ఏమిటంటే.. ఈ కథనాన్ని ప్రచురించిన V6 News మీడియా సంస్థ యాజమాన్యం గనులు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకట స్వామిది. V6 News ఛానల్ సీఈవోగా, వెలుగు పత్రికు ప్రింటర్, పబ్లిషర్ గా అంకం రవి వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గతంలో V6 News ఛానల్ లోనే యాంకర్ గా పనిచేశారు. ‘తీన్మార్’ అనే శీర్షికతో ఆ ఛానల్ లో ప్రసారం చేసిన బులెటిన్ ద్వారానే శింతపండు నవీన్ అనే వ్యక్తి గొంగడి వేషధారణలో ‘తీన్మార్ మల్లన్న’గా పాపులర్ అయ్యారు. V6 News సీఈవో అంకం రవిని మల్లన్న తన ‘బాస్’గా బాహాటంగానే చెబుతుంటారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి (ఫైల్ ఫొటో)

అయితే శింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి ఘటన, కవితకు లభించిన మద్ధతు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల నుంచి వచ్చిన స్పందన తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘కవిత వెనుక ఎవరు?’ అని ప్రశ్నిస్తూ, మొత్తంగా మల్లన్న ఆఫీసుపై దాడి ఘటనను అధికార పార్టీకి చెందిన మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ వంటి బీసీ నేతలు మాత్రమే ఖండిచారని, ప్రభుత్వం నుంచి సరైన మద్ధతు, దాడికి పాల్పడినవారిపై చర్యలకు ఆదేశాలు జారీ కాలేదనే భావన స్ఫురించేలా V6 News డిజిటల్ ఎడిషన్ వార్తా కథనం ఉందనే రాజకీయ చర్చ జరుగుతోంది. దాడి జరిగింది మల్లన్నమీదే అయినా, కవిత అనుచరుల ఫిర్యాదుపై మల్లన్నపైనే సీరియస్ కేసులు నమోదయ్యాయని, అనుచిత వ్యాఖ్యల అంశంతోపాటు తన ఆఫీసులోనే జాగృతి కార్యకర్తలపై దాడి చేశారంటూ ఎదురుకేసులు నమోదయ్యాయని V6 News డిజిటల్ ఎడిషన్ తన వార్తా కథనంలో వాపోయింది.

ఇదే దశలో గతంలో తమ సంస్థలో పనిచేసిన శింతపండు నవీన్ కు ‘శిష్య దక్షిణ’గా ఈ వార్తా కథనాన్ని ప్రచురించారా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. V6 News డిజిటల్ ఎడిషన్ ప్రచురించిన ఆ వార్తా కథనంలోని పరిభాషా ప్రకారం మాత్రమే ఇటువంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ డిజిటల్ ఎడిషన్ పేజీల్లో ‘ఇంప్రింట్’ రూల్ ను పాటించకపోవడం మరో ఆసక్తికర అంశం. ‘ఇంప్రింట్’ అంటే పత్రికా భాషలో దాని ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్ పేరును వెల్లడిస్తూ, ఎక్కడి నుంచి ప్రచురిస్తున్నారనే వివరాలను తన పాఠకులకు వెల్లడించడం అన్నమాట. ఇంకా అసలైన కొసమెరుపు ఏమిటంటే.. డిజిటల్ ఎడిషన్ లోని ఆ వార్తా కథనం నేటి ‘వెలుగు’ పత్రిక ప్రింట్ ఎడిషన్ లో ఎక్కడా కనిపించకపోవడం.

Popular Articles