సత్తుపల్లి: రాజకీయాల్లో వ్యక్తిత్వంపై తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిబద్ధతతో రాజకీయాల్లో పని చేస్తే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందని, రాజకీయాల్లో క్యారెక్టర్ దెబ్బ తింటే ఎంత డబ్బు ఉన్నా ఓడిపోతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తుమ్మల చేసిన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదేవిధంగా సత్తుపల్లి ప్రాంతంలో హవాలా కార్యకలాపాలు, సైబర్ నేరాల్లో నిందితులుగా మారుతున్న తీరుపై తుమ్మల స్పందిస్తూ ఈ ప్రాంతానికి చెడ్డపేరు తీసుకురావద్దని హితవు చెప్పారు. సత్తుపల్లి మండలం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీసుకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, పంచాయతీలు ఆదాయ మార్గాలు పెంచుకుని గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సత్తుపల్లి ప్రాంత అభివృద్ధిని గుర్తు చేస్తూ, 1964 ప్రాంతంలోనే మండలంలెని కిష్టారం, గంగారంలో హై స్కూల్ నిర్మాణ పనులు జరిగాయని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తీసుకొచ్చిన కీర్తిని కాపాడుకుంటూ అంతకంటే ఎక్కువ కీర్తి సత్తుపల్లికి వచ్చేలా తాను పని చేశానని తెలిపారు. శ్రీరామచంద్ర స్వామి దయతో గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరుకుంటున్నాయని తుమ్మల అన్నారు.

జనవరి తర్వాత 34 నిమిషాలలో గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా ఖమ్మంకు చేరుకుంటామని మంత్రి తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దుగా సత్తుపల్లి ఉందని, అన్ని మండలాలకు దగ్గరలో ఉండేటట్లు సెంటర్ పాయింట్ చూసి కల్లూరు డివిజన్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి వెంట కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

