ఖమ్మం: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వెలుగుమట్ల మోడల్ కాలనీ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు వెలుగుమట్ల భూ నిర్వాసితుల్లో అర్హులకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, పేదలను కొంత మంది ముఠాగా ఏర్పడి మోసం చేస్తే గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు పేరిట ఇచ్చిన పత్రాలు బోగస్ అని, సిసిఎల్ఏ ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. లాఠీ ఛార్జ్ లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి దగాకోరులను తరిమివేశామని మంత్రి తెలిపారు.

నిరుపేదలకు వెలుగుమట్ల భూదాన్ భూములలో భూ పట్టాలు పంపిణీ చేస్తున్నామని, పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ మోడల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులు, విద్యుత్, మంచి నీరు, రోడ్లు, డ్రైయిన్ వంటి మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రిని తీసుకువచ్చి భూ దాన్ భూములలో నూతనంగా చేపట్టే 311 మంది లబ్ధిదారుల కాలనీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నిరుపేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో కొంత ఇబ్బంది పడటం జరిగిందని ఆయన తెలిపారు. అనధికారికంగా నిరుపేదలు నివసించే దుస్థితి రాకుండా అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. వెలుగుమట్లలో 311 మంది లబ్ధిదారులే కాకుండా మరో 101 మంది నిరుపేదలకు వారి సొంత ఊరిలో ఉన్న స్థలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామన్నారు. చివరి లబ్ధిదారుడి వరకు ఇండ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వెలుగుమట్ల కాలనీ అద్భుతంగా తీర్చి దిద్దుతామని, పేదల దగ్గర డబ్బులు వసూలు చేసిన దళారుల వివరాలు పోలీసులకు అందించాలని, వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.

