ఖమ్మం: నగరంలో రోడ్ల వెడల్పు అంశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల అంగీకారం ఉంటేనే రోడ్లు వెడల్పు చేస్తామన్నారు. ఖమ్మం నగరంలో రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలన్నారు. రోడ్ల వెడల్పు కారణంగా పావలా నష్టపోతే ప్రజలకు రూపాయి వరకు పరిహారం అందిస్తూ ఆదుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో వెడల్పు చేయాల్సిన రోడ్ల వివరాలు అందించాలని అన్నారు. ఖమ్మం ముస్తఫా నగర్ లో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, ప్రజల అంగీకారం ఉంటే బోనకల్ రోడ్డు వెడల్పు చేస్తామన్నారు. రోడ్డు వెడల్పు జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజలు ప్లాస్టిక్, చెత్తను రోడ్లు, మురికి కాల్వలలో వేయవద్దని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకుంటే రోగాల బారిన పడి డబ్బులు అనవసరంగా ఆసుపత్రిలో ఖర్చు అవుతాయన్నారు. అదేవిధంగా ఖమ్మం నగరంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. త్వరలో తాగునీటి సౌకర్యం కల్పన కోసం మరో రూ. 220 కోట్లు మంజూరు చేస్తామన్నారు. రాబోయే వేసవి కాలంలో ఎక్కడా ఖమ్మంలో మంచినీటి సమస్య ఉండటానికి వీలు లేదని, ప్రతి ఒక్కరికి శుద్ధమైన తాగునీరు అందాలన్నారు.
మనం కష్టపడి సంపాదించిన డబ్బులు పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలని, అనవసరంగా ఆసుపత్రుల పాలు చేయవద్దన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు, స్వామి నారాయణ స్కూల్ కూడా త్వరలో రాబోతున్నాయని మంత్రి చెప్పారు. భగవంతుని దయ, ప్రజల ఆశీర్వాదంతో ఖమ్మం జిల్లా పరిధిలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తనకు భాగస్వామ్యం వహించే అవకాశం లభించిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఖమ్మం నగరం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.

