ఖమ్మం: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుభవార్తను వినిపించారు. ఈ జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉత్తర, దక్షిణ భారతదేశానికి అనుసంధానం చేసే ప్రత్యేక మార్గంగా మారబోతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ధంసలాపురం వద్ద ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను ఆయన శనివారం తనిఖీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్ఓబీ, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను, మున్నేరు బ్రిడ్జి వంతెన పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు. మొత్తం 160 కిలోమీటర్ల జాతీయ రహదారి పూర్తి కావడం వల్ల గంటన్నర సమయంలో రాజమండ్రి వెళ్ళవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇక్కడి వారికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందన్నారు. ధంసలాపురం ఆరోఓబీ సంక్రాంతి నాటికి పూర్తవుతుందని మంత్రి చెప్పారు. ఆర్.ఓ.బి. నిర్మాణానికి సంబంధించి హై టెన్షన్ విద్యుత్ లైన్స్ తరలింపు, భూసేకరణ వంటి అన్ని పనులు పూర్తి చేశామని, ఒకవైపు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసుకుంటే సత్తుపల్లి, రాజమండ్రి వరకు ఉపయోగపడుతుందన్నారు.

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు సంక్రాంతి నాటికి పూర్తియితే హైదరాబాద్ నుండి రాజమండ్రి వైజాగ్ వెళ్ళే వారు విజయవాడ వెళ్లకుండా ఈ హైవే పై 150 కిలో మీటర్ల ప్రయాణం ఆదా అవుతుందన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో నేషనల్ హైవేలు ప్రగతి బాటలు వేస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి నాటికి ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావాలని అన్నారు. రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓబీ త్వరగా పూర్తి చేయాలన్నారు. రైల్వే, కెనాల్, మున్నేరు పై రహదారి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మున్నేరు బ్రిడ్జితో పాటు ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రూ. 3,500 కోట్లతో ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి నిర్మిస్తున్నామన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి చిన్న, చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అన్నారు. కొత్తసంవత్సరంలో కొత్త నేషనల్ హైవేపై ప్రయాణం సంతోషదాయకంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్పొరేటర్లు, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

