ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై కలెక్టరేట్ లో మంత్రి తుమ్మల సమీక్షించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారుల పురోగతి, వెలుగు మట్ల అర్బన్ పార్క్, పర్యాటక అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో తుమ్మల సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత సంవత్సరం వచ్చిన భారీ వరదల నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల ప్రకారం చేసిన డిజైన్ మార్పుల మేరకు మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖమ్మం నగర వాసులు మరోసారి ఇబ్బందులకు గురి కావద్దని ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు మంజూరు చేశామని, పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సేకరించిన భూములను అభివృద్ధి చేసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు అందించేలా రైతులతో చర్చలు జరపాలని మంత్రి తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలని, రెండు వైపుల నుంచి ప్రణాళికాబద్ధంగా పని జరగాలని అన్నారు. ఖమ్మం నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కింద 8.5 కిలో మీటర్ల మురుగు నీటి కాల్వ పూర్తి స్థాయిలో నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన పనులు జరగాలన్నారు. ఎస్టిపి ద్వారా శుద్ది చేసిన మురుగు నీటినీ మనం ఖమ్మం నగరంలో గార్డెనింగ్, మొక్కల పెంపకం, ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు.
జిల్లాలో రైస్ మిల్లర్లపై మనకు కమాండ్ ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు రాక ధాన్యం కొనుగోలు సమస్యలు అధికంగా ఉన్నాయని, అకాల వర్షాలకారణంగా రైతులు నష్టపోతున్నారన్నారు. రవాణా కాంట్రాక్టర్ లతో చర్చించి ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంచి, రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వెలుగు మట్ల అర్భన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్లకు ఇరువైపులా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలన్నారు.

ఖమ్మం ఖిల్లా రోడ్డు సాధ్యమైనంత వరకు విస్తరించాలన్నారు. ఖిల్లా రోప్ వే పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. రోప్ వే స్టేషన్ దగ్గర వరకు ప్రయాణికులు వచ్చేలా చూడాలని మంత్రి సూచించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వరకు జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లు వచ్చేలా కృషి చేయాలన్నారు. ధంసలాపురం ఎగ్జిట్ దగ్గర రైల్వే లైన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణ శంకుస్థాపన త్వరలో జరుగుతుందని, ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి అవసరమైన ప్రతిపాదనలు అందించాలన్నారు.
కాగా ఖమ్మం నగరంలోని 49 వ డివిజన్ మామిళ్లగూడెంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసిరోడ్లు, స్మార్ట్ డ్రైన్ లు, 7వ డివిజన్ టేకులపల్లిలో రూ. 40.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్మార్ట్ డ్రైన్, కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శంకుస్థాపన చేశారు.