Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

త్వరలోనే మక్కల కొనుగోళ్లు: మంత్రి తుమ్మల

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను త్వరలోనే ప్రారంభించేలా మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కు ఆదేశాలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఖమ్మం నగరంలోని 44వ డివిజన్ శ్రీరామ్ నగర్ లో మున్సిపల్ సాధారణ నిధులు 58.50 లక్షలతో షెడ్లు, ప్లాట్ ఫాంలతో నిర్మించిన రైతు బజార్ ను పునః ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, రైతులు తాము పండించిన కూరగాయలను నేరుగా రైతు బజార్ లో అమ్ముకునేందుకు వీలుగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కూరగాయలు పండించే రైతులు సొంతంగా నేరుగా అమ్ముకునేందుకు సౌకర్యంగా ఉండాలని గతంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ లో నేడు ఫ్లాట్ ఫాం, షెడ్లు నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. పేద రైతుల కోసం కలెక్టర్ మంచి హృదయంతో ఈ పనులు పూర్తి చేశారని తెలిపారు.

రైతు బజార్ ను పునఃప్రారంభిస్తున్న మంత్రి తుమ్మల, పక్కన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తదితరులు

మార్కెట్ లో పంట పండించే రైతులకు మాత్రమే స్థానం ఇవ్వాలని, దళారులకు ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వకూడదని, ఖమ్మం చుట్టుపక్కల ఉన్న రైతులు నేరుగా వచ్చి అమ్ముకోవాలని, అప్పుడు రైతులకు ఒక రూపాయి మిగలడంతో పాటు స్థానిక ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, రైతుకు వచ్చే లాభాలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రైతు బజార్ ప్రారంభించామన్నారు. రైతులు ఏ పంటలు పండించాలి, ఎలా పండించాలి అనే అంశాలపై దృష్టి సారించి లాభసాటి సాగు గురించి జిల్లాలో మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని కలెక్టర్ తెలిపారు.

మధ్యవర్తులను నివారిస్తూ రైతులకు అధిక లాభం లభించేలా రైతు బజార్ లను ఏర్పాటు చేశామని, 35 లక్షలతో గాంధీ చౌక్ వద్ద మరో మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, మరో నెల రోజులలో ఆ మార్కెట్ సిద్ధం చేస్తామని అన్నారు. ఈ రైతు బజార్ వద్ద రైతులు నుంచి నేరుగా వినియోగదారులు కూరగాయలను కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles