ఖమ్మం నగరం మధ్య నుంచి ప్రవహించే మున్నేరు నదికి వరద ముప్పు పొంచి ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. శనివారం రాత్రి 6.47 గంటల ప్రాంతంలో ఈమేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. మున్నేరు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ముప్పు పొంచి ఉందని, జిల్లా ఉన్నతాధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. ప్రస్తుతం ఖమ్మం వద్ద మున్నేరు నీటి మట్టం 14.75 అడుగుల మేర ప్రవహిస్తోందన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, మున్నేరు పరీవాహక ప్రాంతంలోని 12 మున్సిపల్ డివిజన్లలో ప్రజలకు అవసరమైన అత్యవసర తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ను, ఉన్నతాధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
