Top 5 This Week

Related Posts

ప్రస్తుత పనులు పూర్తి చేస్తే, మళ్లీ నిధులు తీసుకొస్తా: తుమ్మల

ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. నగరంలో ఇప్పటికే ప్రారంభించిన పనులను వర్షాకాలంలోగా పూర్తి చేయాలన్నారు. మొదలు పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే, మళ్లీ కావలసిన నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ లోటస్ హిల్స్ లో టియుఎఫ్ఐడిసి నిధులు కోటి రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, క్రమపద్ధతిలో అభివృద్ధి చేయాలని, వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరగాలని అన్నారు.  ఖమ్మం నగరంలో ఉన్న అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. లోటస్ హిల్స్ నందు డైనైజ్ వ్యవస్థ కు ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

నది, కాల్వ లపై అక్రమ నిర్మాణాలు, రోడ్డుపై ఏ రకమైన మత ప్రార్థనా మందిరాలు ఉండవద్దని, అటువంటి అక్రమ నిర్మాణాలను ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నారు. క్రమపద్దతిలో అభివృద్ధి చేస్తేనే ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. ఆక్రమణలలో ఎక్కడైనా పేదలు ఉంటే వారికి అవసరమైన ఇండ్ల స్థలం, ఇండ్లు, జీవనోపాధికి ప్రభుత్వ పథకాల క్రింద ద్వారా సహాయం అందించాలని అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మురికి కాలువలు నీరు నిల్వ ఉండకూడదని, నగరం శుభ్రంగా ఉండాలని అన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని మంత్రి తెలిపారు. పనులు నాణ్యతతో పూర్తిచేయాలని అన్నారు. చేపట్టిన పనులు వర్షాకాలం వచ్చే లోగానే పూర్తిచేయాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Popular Articles