జాతీయ రహదారుల, ఆయిల్ పామ్ పంటల వృద్దిలో ఖమ్మం జిల్లాను చూసి ఇతర జిల్లాలు నేర్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఖమ్మం నుంచి 33 నిమిషాలలో సత్తుపల్లికి వచ్చేలా కల్లూరు, వేంసూరు జాతీయ రహదారి ఎగ్జిట్ ఏర్పాటు చేశామని, ఆగస్టు 15 నాటికి ఈ పనులు పూర్తి అవుతాయని చెప్పారు. ఆదివారం వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, టి.జి. ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డిలతో కలిసి నూతన ఆయిల్ పామ్ కర్మాగార పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతాయని, ఆయిల్ ఫెడ్ నుంచి ఇచ్చే ఏ మొక్కలు కూడా కల్తీవి లేవని, నర్సరీ దశలోనే కల్తీ మొక్కలు కనిపెట్టడం జరుగుతుందని అన్నారు. ఆయిల్ పామ్ పంటకు గిట్టుబాటు ధర రూ. 21 వేలు దాటే విధంగా అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. హార్టికల్చర్ వ్యవసాయ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం ఎక్కువ ఆయిల్ పామ్ పంట సాగు ప్రారంభమైందని, రాబోయే 10 సంవత్సరాలలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని మంత్రి తెలిపారు.

ఆయిల్ పామ్ పంటకు కరువు, వరదలతో ఇబ్బందులు లేవని, 3 సంవత్సరాలలో పంట వచ్చే మొక్కలు అందిస్తున్నామని, రైతులు ఆలోచించి ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని, పంట సాగు పెరిగే కొద్దీ అవసరమైన ఫ్యాక్టరీలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో రైతులకు మంచి రేటు లభిస్తుందని, గతంలో కూడా ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడామని అన్నారు. ఆయిల్ పామ్ పంటకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తామని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సత్తుపల్లిలో అభివృద్ధి పనులు ప్రత్యేక శ్రద్ధతో చేపట్టడం జరుగుతుందని అన్నారు. వేంసూరు మండలంలో రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గతంలో ఎన్టిఆర్ కాలువ పూర్తి చేశామని అన్నారు. రాజీవ్ లింక్ కాలువ పూర్తి చేసి వైరా నియోజకవర్గ పరిధిలో సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందించామని అన్నారు.
జూన్ నెలలోపు సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొని వస్తామని, నాగార్జున సాగర్ నిండకపోయినా గోదావరి నీటితో వేంసూరు మండల చెరువులు నింపు తామని అన్నారు. వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందేలా సీతారామ ఎత్తిపోతల పథకం నీటి సరఫరా చేసేందుకు పెండింగ్ పనులకు సవరించిన అంచనాలను సీఎం ఆమోదించారని తుమ్మల చెప్పారు.

