Saturday, September 6, 2025

Top 5 This Week

Related Posts

సౌత్ ఇండియాకే గేమ్ ఛేంజర్ గ్రీన్ ఫీల్డ్ హైవే: మంత్రి తుమ్మల

ఖమ్మం – దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణకు, దక్షిణ భారత దేశానికి గేమ్ ఛేంజర్ గా మారబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. శనివారం ఆయన ధంసలాపురం వద్ద ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు. మొత్తం 160 కిలోమీటర్ల జాతీయ రహదారి పూర్తి కావడం వల్ల గంటన్నర సమయంలో రాజమండ్రి వెళ్ళవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇక్కడి వారికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రహదారిగా తయారవుతుందన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి డిజైన్స్ ఆలస్యం కావడం వల్ల ఆలస్యం జరిగిందన్నారు. ధంసలాపురం ఆరోఓబి నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఆర్.ఓ.బి. నిర్మాణానికి సంబంధించి హై టెన్షన్ విద్యుత్ లైన్స్ తరలింపు, భూసేకరణ వంటి అన్ని పనులు పూర్తి చేశామని, నవంబర్ నాటికి ఒకవైపు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసుకుంటే సత్తుపల్లి జంగారెడ్డిగూడెం వరకు ఉపయోగపడుతుందని అన్నారు. కొత్త సంవత్సరంలో ఖమ్మం – దేవరపల్లి జాతీయ రహదారి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావాలన్నారు. రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓబీ త్వరగా పూర్తి చేయాలన్నారు. రైల్వే, కెనాల్, మున్నేరు పై రహదారి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లు వేస్తే రైతాంగానికి ఉపయోగ పడుతుందని, దీనికి కావలసిన ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా వ్యవసాయ ప్రాంతం అధికంగా ఉందని, నాగార్జున్ సాగర్ కాల్వ క్రింద ఆయకట్టు ఉన్నందున 365 రోజుల పాటు హార్వెస్టర్ రాకపోకలు ఉంటాయని, రహదారి వాహనాలకు ఆటంకం కలగకుండా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

వర్షాలు తగ్గిన నేపథ్యంలో మున్నేరు బ్రిడ్జ్ తో పాటు ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రూ. 3,500 కోట్లతో ఖమ్మం – దేవరపల్లి జాతీయ రహదారి నిర్మిస్తున్నామన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి చిన్న, చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. మంత్రి వెంట గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్ఓబి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు ఉన్నారు.

Popular Articles