Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఇరిగేషన్ అధికారులపై తుమ్మల ఆగ్రహం

ఇరిగేషన్ అధికారులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరదల నుండి భద్రాచలం పట్టణ, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు, రవాణా మార్గానికి ఇబ్బందులు లేకుండా కొత్తగా చేపడుతున్న కరకట్ట పనుల నిర్మాణములో అలసత్వం వహిస్తున్నందుకు సంబంధిత ఇరిగేషన్ శాఖ ఎస్ఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల సంబంధిత ఎస్ఈలను ఆదేశించారు. శుక్రవారం భద్రాచలంలోని సుభాష్ నగర్, కూనవరం రోడ్డులోని కొత్తగా నిర్మాణం చేపడుతున్న స్లూయిస్ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సంవత్సర కాలం నుండి పనులు సరిగా జరగడం లేదని, ఇందుకు కారణం తెలపాలని ఎస్ఈలపై మండిపడ్డారు. వచ్చే మే 31 నాటికి పనులు కంప్లీట్ కావాలని, ఈసారి గోదావరి వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలుగాని, భద్రాచలం పట్టణ ప్రజలుగాని ఎవరు ఇబ్బందులు పడకూడదని, అందుకు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పాత కరకట్ట స్లుయిస్ పాయింట్ నుండి ఇప్పుడు నిర్మాణం జరిగే కరకట్టవరకు ఎత్తు పెంచాలని అలాగే పర్మనెంట్ గా మోటార్లు బిగించాలని, ఆటోమేటిక్ సెటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కరకట్ట నిర్మాణం పనులకు ఏమైనా అడ్డంకులు ఉంటే శ్రీరామనవమి కాగానే జిల్లా కలెక్టర్ ను సంప్రదించి సమస్య పరిష్కరించుకొని వెంటనే పనులు ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహించే ఎస్ఈలపై, డీఈలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

అదేవిధంగా భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణపై మంత్రి తుమ్మల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో వెలసిన రాముడు కంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రాముడు నడయాడిన ప్రాంతం భారతదేశానికి తలమానికమని, అటువంటి రాముడి కళ్యాణానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

శ్రీరామ నవమి ఏర్పాట్లపై భద్రాచలంలో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

రాముల వారి కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేయడానికి వస్తున్నందున జిల్లా యంత్రాంగం సమన్వయంతో వారికి అప్పగించిన బాధ్యతలే కాకుండా తోటి అధికారుల బాధ్యతలు కూడా తీసుకోవాలన్నారు. ఈమేరకు వీవీఐపీలకు, వీఐపీలకు, రామ భక్తులకు గాని, ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మర్యాదపూర్వకంగా ప్రవర్తించి అందరూ తనివి తీర కళ్యాణం తిలకించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. స్వామి వారి కళ్యాణం వైభవపేతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు.

కాగా అన్ని రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్న జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ఖనిజనిక్షేపాలు ఉన్నందున చదువుకున్న యువతీ యువకులకు ఖనిజాలను వెలికి తీసే విధంగా అవగాహన కల్పించడానికి యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాలయం కొత్తగూడెంలో వాటి చేయడానికి ముఖ్యమంత్రి సమ్మతించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం వలన అనేక ఖనిజా నిక్షేపాలు ఉన్న మన కొత్తగూడెంలోని యువతి యువకులు ఈ విశ్వవిద్యాలయం ద్వారా అవగాహన పెంచుకొని తెలంగాణకి మంచి పేరు తేవాలన్నారు.

భద్రాచలం దేవస్థానం భక్తులు అధిక సంఖ్యలో రావడానికి తక్కువ ఖర్చుతో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కొత్తగూడెంలో విమానాశ్రయం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి కేంద్రమంత్రికి నివేదించడం జరిగిందని, త్వరలో అనుమతులు వస్తాయన్నారు. భద్రాచలంలో ఎక్కువ శాతం ఆదివాసీ గిరిజనులు నివసిస్తూ ఉంటారని, ఈ ప్రాంతానికి రైలు మార్గం కొరకు పాండురంగపురం నుండి మల్కనగిరి రైల్వే లైన్ కలుపుతూ 16 కిలోమీటర్లు సర్వే పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. సారపాక వరకు రైలు మార్గం పూర్తయితే భద్రాచలం భక్తులు రావడానికి సమయం కలిసి వస్తుందని, నేషనల్ హైవే అమరావతి నుండి జగదల్పూర్ వరకు, అలాగే భద్రాచలం నుండి ఏటూరు నాగారం డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం కొరకు సర్వే చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల చెప్పారు.

Popular Articles