హైదరాబాద్: మొంథా తుపాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించారు. ఇందులో భాగంగానే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి కీలక సూచనలు చేశారు. మొంథా తుపాను తీరం దాటిన నేపథ్యంలో గత రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, రైతులు రైతులు, పశువుల కాపర్లు వాగులు వంకలు దాటకుండా కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రధాన రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయని, ఈ వర్ష ప్రభావంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది చెరువుల వద్ద పర్యవేక్షణగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
అత్యవసర వైద్య సేవల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల కోరారు. అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దని తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు.

