Top 5 This Week

Related Posts

‘ఫ్యూచర్ సిటీ’తో 13 లక్షల ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తామని తెలంగాణా ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అద్భుతమైన మౌలిక వసతులతో 13,500 ఎకరాలలలో జీరో కార్బన్ సిటీగా దీన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ, యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ డాలర్స్ తెలంగాణా’ అనే అంశంపై ప్రభుత్వ ప్రణాళికలను మంగవారం ఆయన గ్లోబల్ సమ్మిట్ లో వివరించారు.

భవిష్యత్ నగరాన్ని ఆరు అర్బన్ జిల్లాలుగా అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్ టెయిన్ మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల జిల్లాలుగా మొత్తం ఆరింటిని నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు చెప్పారు. ఇక్కడ ఏర్పాటయ్యే వివిధ పరిశోధన సంస్థలు, గ్రీన్ ఫార్మా, మ్యాన్యుఫాక్చరింగ్, ఎంటర్ టెయిన్ మెంట్ జోన్ల ద్వారా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. తొమ్మిది లక్షల జనాభా కోసం నివాస గృహాల సముదాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మాణరంగంలో ఉన్నవారు వీటిని అభివృద్ధి చేస్తారని తెలిపారు.

మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. వచ్చే ఫిబ్రవరి చివరలో ఇక్కడ నిర్మాణాలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఎంటర్ టెయిన్ మెంట్ జోన్ (డిస్ట్రిక్ట్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కన్ వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, అడ్వెంచర్ కేంద్రాలు, స్టార్ హోటళ్లు నిర్మిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ అంతా ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తు అవసరాలకు సరిపోయే అత్యాధునిక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అర్భన్ ఫారెస్టులతో అంతా పచ్చదనం పర్చుకుని కనిపిస్తుందని,వంతారా (vantara) వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జీరో కార్బన్ సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా భాసిల్లుతుందన్నారు. ఇక్కడ కురిసే ప్రతి వర్షం చుక్క ఇక్కడే ఇంకిపోయేలా రెయిన్ హార్వెస్టింగ్ జరుగుతుందన్నారు. భూగర్భ జలాలకు కొదువ లేకుండా చేస్తామని, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో నూతన పరిశోధనలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

Popular Articles