హైదరాబాద్: తెలంగాణా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘సారీ’ చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినట్లు వ్యాప్తిలోకి వచ్చిన ‘దున్నపోతు’ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అల్టిమేటమ్ జారీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారంలోగా తనకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి లక్ష్మణ్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి లక్ష్మణ్ కు మంద కృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరిసింహులు వంటి నాయకులేగాక, దళిత సంఘాలు కూడా బాసటగా నిలిచాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశాయి. వివాదం తీవ్రతరమవుతన్న పరిణామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మణ్ కోరుకున్నట్లు ‘క్షమాపణ’ (Apology) సంగతి ఎలా ఉన్నప్పటికీ, చింతిస్తున్నాను.. విచారిస్తున్నాను (అంగ్ల పదం ప్రకారం ‘sorry’ అర్థం వచ్చేలా) అంటూ పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియాలో జారీ చేసిన ప్రకటన ఉన్నది ఉన్నట్టుగా దిగువన చదవవచ్చు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రకటన:
‘‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నాకు సోదరులవంటివారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. ఎవరు విడదీయరానిది. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో,రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం.’’

UPDATE:
క్షమాపణ చెప్పిన పొన్నం ప్రభాకర్:
కాగా పొన్నం ప్రభాకర్ ఈ ప్రకటనను విడుదల చేసిన అనంతర పరిణామాల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో కీలక భేటీ జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ఈ భేటీకి హాజరయ్యారు. ఇద్దరు మంత్రుల మధ్య పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సయోధ్య కుదిర్చారు. ఈ భేటీలో మరో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు శివసేన రెడ్డి, సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా తాను , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నామని, తమకు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. తాను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు. తనకు అలాంటి ఆలోచన లేదని, తాను ఆ ఒరవడిలో పెరగలేదని, కాంగ్రెస్ పార్టీ తనకు ఆ సంస్కృతి నేర్పలేదన్నారు. లక్ష్మణ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నానని, కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గం మేమంతా కలిసి పెరిగామని, అపోహ ఉండవద్ధని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.