Top 5 This Week

Related Posts

రెవెన్యూ యంత్రాంగానికి మంత్రి పొంగులేటి కీలక ఆదేశం

హైదరాబాద్: రెవెన్యూ శాఖ అధికార యంత్రాంగానికి మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్సాల నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుపాన్ వల్ల తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలపై బుధవారం రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాగల 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందాని, ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పరిస్థితి గురించి మంత్రి ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు-ఏన్కూరు మార్గంలోని జన్నారం వాగులో లారీ కొట్టుకుపోతున్న దృశ్యం

ముఖ్యంగా విద్యుత్తు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పోలీసులతో పర్యవేక్షించాలన్నారు. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పొంగులేటి ఈ సందర్బంగా సూచించారు

Popular Articles