Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఓడిన సర్పంచ్ అభ్యర్థులపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ఖమ్మం: ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో వెల్లువెత్తిన ప్రజా చైతన్యం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందన్నారు. ఈ విజయం అహంకారానికి తావు ఇవ్వకూడదని, బాధ్యతను గుర్తు చేయాలన్నారు. గెలిచిన సర్పంచులు ప్రజల కష్టాల్లో తోడుండాలని చెబుతూ, ఎన్నికల్లో గెలిచిన వారే కాదు, స్వల్ప తేడాతో ఓడిన వారు కూడా తన దృష్టిలో సర్పంచులేనని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. ఖమ్మం వైరా రోడ్డులోని ఎస్.ఆర్. గార్డెన్స్‌లో పాలేరు నియోజకవర్గ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ‘ఆత్మీయ సన్మాన సభ’ బుధవారం జరిగింది.

ఈ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, తన నియోజకవర్గంలోని 134 పంచాయతీల్లో సుమారు 70 శాతం కాంగ్రెస్ మద్దతుదారులు జయకేతనం ఎగురవేయడం శుభపరిణామన్నారు. ‘మనలో మనకు ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు పోటీ పడటంతో స్వల్ప తేడాతో సీట్లు చేజారాయి. అయినప్పటికీ, పదేళ్లు ఏలిన వారు నేడు వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయికి పడిపోయారంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారో స్పష్టమైంది” అని మంత్రి అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా మెరుగైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

కాగా కల్లూరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. సుమారు రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రధాన బీటీ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, అధికారుల పనితీరును ప్రశ్నించారు. కల్లూరు మండల పరిషత్ ఆవరణలో నూతనంగా నిర్మించిన వీఎస్‌ఎస్‌ సమావేశ మందిరాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. ​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కనకగిరి, పులిగుండాల అటవీ ప్రాంతాన్ని విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు దీటుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Popular Articles