ఖమ్మం: రెండో విడత ఇందిరమ్మ ఇండ్లపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ఘనంగా ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఇల్లు నిర్మించుకునే వారు పునాది దశ నుంచి స్లాబ్ వరకు పూర్తి చేసే ప్రతి అంచెలోనూ నేరుగా వారి ఖాతాల్లోకే నిధులు జమ చేస్తామని, ఇందులో ఎక్కడా దళారుల ప్రమేయం ఉండదని భరోసా ఇచ్చారు. రాబోయే మూడేళ్ల కాలంలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు, తరుణీ హాట్ సమీపంలో రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఖమ్మం రూరల్ మండల సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రజా పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కేవలం అర్హతే ప్రాతిపదికగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఏదులాపురం మున్సిపాలిటీకి 530 ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు.

పాలన సౌలభ్యం కోసం రూ. 45 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత భవనం గురించి మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉన్న సుమారు 19 ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటికి తీసుకురావడం వల్ల సామాన్య ప్రజలకు వ్యయప్రయాసలు తప్పుతాయని పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన కేవలం 8 నుండి 9 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ. 221 కోట్లు కేటాయించామని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 129 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఇచ్చే ఈ సాయం ఒక గొప్ప వరమని ఆయన కొనియాడారు.
మానుకోటలో..
గత పదేళ్ల బీఆర్‌ఎస్ అరాచక పాలనకు స్వస్తి పలికి, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ విజయం కార్యకర్తల కష్టార్జితమని కొనియాడారు. “పదేళ్ల కాలంలో నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది” అని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

