హైదరాబాద్: లైసెన్సుడ్ సర్వేయర్లకు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిల్పకళా వేదికలో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. భూపరిపాలనలో ఇది మరో ముందడుగుగా ఆయన అభివర్ణించారు.
తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి, రాష్ట్రంలో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్, సర్వే విభాగం కమీషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామ రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే గ్రామ పాలనాధికారులు (జీపీవో)ను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. తాజాగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సులభంగా భూసేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ ను జత పరచడం తప్పనిసరి చేసిన నేపధ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత కీలకం కానుందన్నారు.
మొత్తం పదివేల మంది సర్వేయర్లు దరఖాస్తు చేసుకోగా, తొలి విడతలో ఏడు వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో 3,465 మంది అర్హత సాధించారని, రెండవ విడతలో మరో మూడు వేల మందికి ఆగస్టు 18వ తేదీన శిక్షణను ప్రారంభించామని, వీరికి ఈనెల 26వ తేదీన జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష ఉంటుందని చెప్పారు. అనంతరం వీరికి 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని, వీరిసేవలు కూడా డిసెంబర్ రెండవ వారం నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు.
ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీవోలు, ఇప్పుడు ప్రతి మండలంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఉంటారన్నార. ఈ రెండు చర్యలతో ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు అందేలా వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎలాంటి అవినీతిలేని సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

