Top 5 This Week

Related Posts

ఇంటింటికీ సంక్షేమం బాధ్యత సర్పంచులదే: మంత్రి పొంగులేటి

ఇల్లెందు: ఇంటింటికీ సంక్షేమం అందించే బాధ్యత సర్పంచులదేనని తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాలని, అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలనను అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఉద్భోదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డ్ మెంబర్లకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పట్టణాలు, పల్లెలోనే తేడా లేకుండా ప్రతి పేదవారికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిగడపకు చేరుస్తున్నట్లు చెప్పారు. వాటి ఫలితమే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 69 శాతం సర్పంచులు, వార్డ్ మెంబర్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు.

కొద్ది రోజుల్లో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఇప్పటికే అనేకసార్లు ఇల్లెందులో పర్యటన చేసి అనేక అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. అంతేకాదు 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు కూడా వడివడిగా జరుగుతున్నాయని, 76 జీవోకు సంబంధించి నెలకొన్న సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లెందు పట్టణాన్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

అభివృద్ధి, సంక్షేమాలు ప్రతి గ్రామానికి రావాలన్నా, ఇంటి గుమ్మానికి చేరాలన్నా, పేదవాడికి అండగా ఉండాలన్న అది ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ మూడేళ్లు కాదు వచ్చే ఐదేళ్లు కూడా ఇందిరమ్మ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. ప్రజా దీవెనలు, ఆశీస్సులు సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైతే అందించారో, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని పొంగులేటి కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Popular Articles