ఓట్లు, ఇందిరమ్మ ఇండ్లపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో మంత్రి మంగళవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఎవరికి ఓటు వేస్తారని అడగకుండానే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామన్నారు. ఇంకా మూడు విడతల్లో మరిన్ని ఇళ్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఎవరి రాజకీయ అభిప్రాయం ఎలా ఉన్నా, ఎవరికి ఓటు వేస్తారో అడగకుండానే ఇళ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెంలో రెండు చోట్ల రూ.3.30 కోట్ల విలువైన పీఆర్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అనంతరం రైతు వేదిక వద్ద నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు.
ఎన్నికల ముందు కేసీఆర్ దోచుకున్నారని తాము చెప్పామని, 15 నెలల విచారణ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ 665 పేజీల నివేదికను ఇచ్చారన్నారు. కాళేశ్వరం అవకతవకలు అందులో రుజువయ్యాయని, అక్రమంగా దోచుకున్న డబ్బులు మళ్లీ ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారని, ఆ డబ్బు తీసుకుని బీఆర్‌ఎస్‌కు రెండు చెంపలు చెళ్లుమనిపించాలని మంత్రి పొంగులేటి కోరారు. ఏదులాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలోని 1వ, 59వ, 60వ డివిజన్లకు చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున మంత్రి ఈ సందర్భంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు ఇచ్చామని మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా సైకిళ్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. గతంలో విద్యలో వెనుకబడిన ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే రూ. 470 కోట్లను విద్యాభివృద్ధికి కేటాయించామని తెలిపారు. జేఎన్‌టీయూ ఏర్పాటు కోసం రూ. 208 కోట్లు, పాలేరు నియోజకవర్గంలో ఐటీఐ కాలేజీ మంజూరు చేయించామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దుతాయపి. తల్లిదండ్రులు కష్టపడి పాఠశాలకు పంపిస్తున్నారని మంత్రి అన్నారు.
