Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన

సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయ భవన నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతం తరుణీ హాట్ వద్ద నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయపు నిర్మాణ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనాల నిర్మాణ డ్రాఫ్ట్ ప్లాన్ వివరాలను ఆర్ అండ్ బీ అధికారుల, జిల్లా కలెక్టర్ నుంచి మంత్రి అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సమీకృత మండల కార్యాలయ సముదాయ నిర్మాణ స్థలం పూర్తి స్థాయిలో చదును చేయాలని అన్నారు. ఈ స్థలంలో పాతబడిన, అనవసరమైన నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగించాలని మంత్రి సూచించారు. మండల స్థాయిలో ప్రజల సౌకర్యార్థం అన్ని కార్యాలయాలు ఒకే చోట అన్ని వసతులతో ఉండే విధంగా నిర్మించాలని, దీనికి తగిన విధంగా ప్రణాళికలు, డిజైన్ తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ తదితర అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సముదాయం ఉండాలన్నారు.

కాగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఉన్నా పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం కూసుమంచిలో పర్యటించి రూ. 5 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, జిల్లా పరిషత్ హైస్కూల్ లో పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిళ్ల పంపిణీ, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూసుమంచి మండలంలో రూ. 5 కోట్ల 50 లక్షలతో జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా, డిసెంబర్ చివరి వరకు పనులు పూర్తి చేసి జూనియర్ కళాశాలను ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గంలో 8 నుంచి 10వ తరగతి చదివే ఆడ పిల్లలకు గత సంవత్సరం సైకిళ్ళను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం 8వ తరగతి వచ్చిన విద్యార్దినులకు సైకిళ్ళు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం 8 నుంచి ఇంటర్ వరకు చదివే బాలికలకు సైకిల్స్ అందిస్తానని ప్రకటించారు.

విద్యారంగంలో కాస్త వెనుకబడి ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గత 20 నెలల కాలంలో 470 కోట్ల రూపాయలను విద్యా రంగంలో పాలేరు నియోజకవర్గానికి మంజూరు చేశామన్నారు. రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులం, రూ. 208 కోట్లతో జే.ఎన్.టి.యూ. ఇంజనీరింగ్ కాలేజీ, రూ. 46 కోట్లతో ఐటిఐ కళాశాల, రూ. 5.5 కోట్ల జూనియర్ కళాశాల, తిరుమలాయపాలెం హాస్టల్ రూ. 2 కోట్ల 70 లక్షలు మంజూరు చేశామన్నారు. పిల్లలకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. పాఠశాలలో 3 కంప్యూటర్ ట్రైనింగ్ ట్యూటర్లను నియమించేందుకు 3 లక్షల నిధులను మంత్రి మంజూరు చేశారు. పాఠశాల కాంపౌండ్ వాల్ తో పాటు పాఠశాలకు ఆదాయం వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. ఆయా పర్యటనల్లో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితర అధికారులు ఉన్నారు.

Popular Articles