Top 5 This Week

Related Posts

పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన

నేలకొండపల్లి: రాష్ట్రంలో నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి గురువారం విస్తృతంగా పర్యటించారు. నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాలో రూ. 30 లక్షలతో, బుద్దారం గ్రామంలో 15 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 58 మంది లబ్ధిదారులకు 20 లక్షల 29 వేల రూపాయల విలువ గల సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను మంత్రి అందజేశారు. కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో 90 మంది లబ్ధిదారులకు 37 లక్షల 97 వేల 500 రూపాయల సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేశారు. పాలేరు రిజర్వాయర్ లో చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ పందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పేద ప్రజలకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. వైద్య రంగం పట్ల పేద ప్రజలకు అనేక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. పేదల పక్షపాతిగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.

ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 22 నెలల సమయం గడిచిందని, మన పాలనలో పేదలు భరోసాతో తల ఎత్తుకొని తిరిగే విధంగా పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదని, అందులో భాగంగా మత్స్యకార సోదరులకు ఉపయోగపడే విధంగా నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతి పెద్ద ప్రాజెక్టు పాలేరు రిజర్వాయర్ లో రెండు సార్లు చేప పిల్లలను విడుదల చేశామన్నారు. మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు ఈ సంవత్సరం రాబోయే 15 రోజులలో పెద్ద సైజ్ గల రొయ్య పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మీడియం, మేజర్ రిజర్వాయర్లలో విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్భాటాలకు పోకుండా నిధులను పొదుపుగా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ప్రభుత్వం వాడుతుందని మంత్రి తెలిపారు. పేదల పక్షపాతిగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు.

Popular Articles