అభివృద్ధి, సంక్షేమం సమ ప్రాధాన్యతగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి పొంగులేటి నేలకొండపల్లి మండలంలో పర్యటించి నాచేపల్లి గ్రామంలో కొత్త కొత్తూరు నుండి వల్లభి వరకు ప్లాన్ నిధులు 40 లక్షలతో చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనులకు, సుర్దేపల్లి గ్రామంలో సుర్దేపల్లి నుండి కిష్టారం హై లెవెల్ బ్రిడ్జి వరకు 35 లక్షలతో చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత పాలకుల వైఫల్యాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పేదల అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత నిస్తూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటూ, పేదవాడి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మన మధ్యలో ఉన్నాయన్నారు. రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేశామన్నారు.

రాబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న యువతకు రాజీవ్ యువ వికాసం క్రింద స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. వరదల వల్ల ఇబ్బందులు పడకుండా 40 లక్షల రూపాయలతో కొత్త కొత్తూరు నుండి వల్లభి వరకు సిసి రోడ్డు నిర్మించుకుంటున్నామని, రాబోయే 45 రోజుల గడువు లోగా ఈ పనిని పూర్తి చేసుకుంటామని అన్నారు. వరదలకు దెబ్బతిన్న రోడ్డులో పూర్తి స్థాయిలో పనులు చేశామని, గ్రామాలలో అవసరమైన చోట్ల నూతన రోడ్ల నిర్మాణం పూర్తి చేసామని, పెండింగ్ ఉన్న చిన్న రోడ్డు పనులు కూడా భవిష్యత్తులో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు.

కాగా మొన్న వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఈ రాష్ట్రాన్ని చూస్తుంటే కడుపు మండుతోందని కేసీఆర్ మాట్లాడారని, ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా? ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా? లేక రైతు సోదరులకు రుణమాఫీ సక్రమంగా చేసినందుకా? ఎందుకు? అని అడుగుతున్నాను అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. భూ భారతి – 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అనాలోచితంగా, ఆర్భాటంగా ధరణి చట్టాన్ని రూపొందించిందన్నారు. పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వారందరికీ చట్టాన్ని చుట్టం చేశారని ఆరోపించారు. వారి హయాంలో మూడున్నరేళ్ల పాటు ధరణి ఉన్నా కనీసం విధివిధానాలు రూపొందించలేదని విమర్శించారు. ధరణి చట్టం వల్ల ఎంతో మందికి నష్టం జరిగింది తప్ప లాభం జరగలేదని తెలిపారు. ఆ నష్టాన్ని , కష్టాన్ని పూడ్చేందుకే భూ భారతి చట్టాన్ని ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకు రావడం జరిగిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాక, ఆ చట్టాల్లో ఉన్న మంచి చెడులను అన్నింటినీ మేధావులు, రిటైర్డ్ అధికారులు, సీనియర్ కలెక్టర్లు తో చర్చించి పేదోళ్లకు న్యాయం జరిగే విధంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.
సమస్య ఏదైనా దానికి భూ భారతి తో శాశ్వత పరిష్కారం జరిగేలా ఈ చట్టం పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే చట్టం పనిచేయదన్నారు. పార్టీలకతీతంగా ఏ పార్టీకి చెందిన వారైనా వారి సమస్యల్లో న్యాయం ఉంటే కచ్చితంగా వారికి ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. తాము తీసుకొచ్చిన చట్టంలో విధి విధానాలను వందరోజుల్లోనే రూపొందించి వాటిని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈ నెల 14వ తేదీన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి రోజున నిర్వహించడం జరిగిందన్నారు. ఈ చట్టం ప్రజలందరికీ చుట్టంలా పనిచేస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.