Top 5 This Week

Related Posts

ఏంది మీ ప్రభుత్వం ఒచ్చేది: బీఆర్ఎస్ పై భగ్గుమన్న పొంగులేటి

ఖమ్మం: పదే పదే తమ ప్రభుత్వం వస్తుందని చెప్పుకుంటూ బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కనవద్దని తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఏంది మీ ప్రభుత్వం ఒచ్చేది? యాడ మీ ప్రభుత్వం ఒచ్చేది? ఈ ప్రజాప్రభుత్వం పేదోడికి అండగా ఉంది. పేదోడి దీవెనలు ఉన్నాయి. ఫలితాలు ఉన్నాయి.. ఇన్ని ఫలితాలు చూశాక కూడా నిస్సిగ్గుగా పగటి కలలు కనవద్దు. ఇంకా ఊహించుుంటున్నావ్.. ముఖ్యమంత్రిని అనో, కాబోయే ముఖ్యమంత్రిని అనో.. మీ పగటి కలలను కల్లలుగానే ఈ తెలంగాణా ప్రజలు ఉంచుతారు.. ఊహల్లో ఊగిసలాడకు’ అని పొంగులేటి బీఆర్ఎస్ నాయకులను ఉటంకిస్తూ పేర్కొన్నారు.

ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు వెలుగుమట్ల భూ నిర్వాసితుల్లో అర్హులకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను బుధవారం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఈనెల 1వ తేదీన ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలైన లబ్దిదారులకు పట్టాలు ఇస్తూ నిలబెట్టుకున్నామన్నారు. సీఎం, కేబినెట్ సహచరుల సహకారంతో 311 మంది ఇంటి స్థలం లేని వారికి ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం, సొంత ఊరిలో స్థలం ఉన్న మరో 101 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను ఎటువంటి భేషజాలు లేకుండా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

వెలుగుమట్ల బాధితురాలికి ఇంటి స్థలం పట్టా కాగితాన్ని అందిస్తున్న మంత్రి పొంగులేటి, చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల తదితరులు

గత నెల 24న వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలు జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి మొసలి కన్నీరు కార్చారని మంత్రి ఎద్దేవా చేశారు. 2023 జూలై నెలలో ఎన్నికల కంటే ముందు వెలుగుమట్ల ప్రాంతంలో కూల్చివేతలకు గత ప్రభుత్వం పాల్పడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిది సంవత్సరాలుగా పేదలు ఎటువంటి వసతులు లేకుండా నివసిస్తుంటే చూస్తూ ఊరుకున్నారే తప్ప ఎటువంటి పట్టాలు పంపిణీ చేయలేదని మంత్రి తెలిపారు.

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించే సమయంలో పేదలకు పట్టాలు ఇవ్వాలనే బుద్ధి జ్ఞానం ఎందుకు రాలేదని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ పాలకులకు ఉద్ధేశించి విమర్శించారు. గత పాలకులకు విశాల హృదయం లేదని, తమ ప్రభుత్వం ప్రజల కష్టాలను చూసి చలించి నేడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షానికి లేదని స్పష్టం చేశారు.

వెలుగుమట్లలో తాగునీరు, రోడ్లు, ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్, విద్యుత్ సరఫరా వంటి అనేక మౌళిక వసతుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. గత 8 సంవత్సరాలుగా పేదలు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని, ఆ సమస్యలకు నేడు పరిష్కారం లభిస్తుందని, అర్హులైన బాధితులు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటె వారికి కూడా తమ ప్రభుత్వం తప్పని సరిగా ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. పేదలను మోసం చేసి దళారులు వసూలు చేసిన డబ్బు ఒక్క రూపాయి కూడా వదలకుండా పూర్తి స్థాయిలో వసూలు చేసి బాధితులకు అందించాలని మంత్రి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ను ఆదేశించారు.

Popular Articles