Top 5 This Week

Related Posts

తులం బంగారం హామీపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

మహిళలకు ఎన్నికల వాగ్ధానంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తులం బంగారం హామీపై తెలంగాణా రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజవర్గంలోని కూసుమంచిలోగల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగానే తులం బంగారం హామీ అమలు ఆలస్యమవుతోందని చెప్పారు.

కాగా వ‌చ్చేవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 చొప్పున ఇందిర‌మ్మ ఇండ్లు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌ని మంత్రి చెప్పారు. పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలైందన్నారు. గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక ప‌రిస్ధితి అస్త‌వ్య‌స్ధంగా త‌యారైంద‌న్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్ర‌జానీకానికి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేసుకుంటూ ముందుకు వెడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

కూసుమంచిలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అదేవిధంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందని, వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఎక్కడా తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందని, ఇచ్చిన ప్రతి మాటను, హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామ‌ని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా చెప్పారు.

Popular Articles