Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

పాలేరులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ఉచితంగా షూస్ పంపిణీ కార్యక్రమానికి పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీకారం చుట్టారు. ఈమేరకు కూసుమంచి మండలం నరసింహులగూడెం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా 1 నుంచి 5వ తరగతి చదువుతున్న బాలబాలికలకు షూస్ అందజేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ నిర్వహించారు.

అదేవిధంగా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. నర్సింహులగూడెం గ్రామంలో కిష్టాపురం నుండి నర్సింహులగూడెం వరకు రూ. 1.33 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, కిష్టాపురం నుండి పోచారం వరకు రూ. 1.61 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, కిష్టాపురం నుంచి ముత్యాలగూడెం వరకు రూ. 2.40 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. జుజ్జులరావుపేట గ్రామంలో రూ. 88 లక్షలతో జుజ్జులరావుపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి మల్లాయిగూడెం పిఆర్ రోడ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కిష్టాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మామిడి నాగమ్మ ఇందిరమ్మ ఇంటిని మంత్రి పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇసుక ఇస్తున్నారా, మొదటి విడత లక్ష రూపాయలు జమ అయ్యాయా అని లబ్దిదారుని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తయి క్రమంలో విడతల వారిగా 5 లక్షలు ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. కూసుమంచి జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

కూసుమంచి తహసిల్దార్ కార్యాలయంలో శాండ్ బజార్ ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక అందించాలని సదుద్దేశంతో ఒక టన్ను గోదావరి ఇసుకను రూ. 1100 కే అందించనున్నట్లు మంత్రి తెలిపారు. స్థానికులకు ఇతర అవసరాలకు టన్ను ఇసుక రూ. 1300కి విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఎక్కడా తప్పులు జరగకుండా అధికారులు పనిచేయాలని, చిన్న తప్పు జరిగిన ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు.

విద్యార్థులకు షూస్ పంపిణీ చేస్తున్న మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేలకొండపల్లి మండలంలో 42, ఖమ్మం రూరల్ మండలంలో 82 మొత్తం 124 మంది లబ్ధిదారులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ, కూసుమంచి మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 20 మంది క్రైస్తవ మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మునిసిపాలిటీ తెల్దారుపల్లి, మద్దులపల్లి లలో మంత్రి పర్యటించారు. మంత్రి పర్యటన లో తెల్దారుపల్లి ముత్యాలమ్మ గుడి నుండి ధోభీఘాట్ వరకు ఎన్ఎస్పీ కెనాల్ మీదుగా రూ. 1.54 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు శంఖుస్థాపన, మద్దులపల్లి ఆర్ అండ్ బి రోడ్ నుండి లుంబినివనం వరకు రూ. 69 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. మంత్రి పర్యటన లో తెల్దారుపల్లి లో అర్హులైన 24 మందికి ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు. మద్దులపల్లి లో 22 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.

Popular Articles