ఇల్లెందు: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రతిష్టను నిలుపుకున్నారు. ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక అంశంలో పార్టీపరంగా తీసుకున్న నిర్ణయం మంత్రి ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇల్లెందులో ఘన విజయం సాధించినప్పటికీ, చైర్మెన్ అభ్యర్థి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత పాలకవర్గంలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల అనంతరం మంత్రి తీసుకున్న చర్యలు ఈ సందర్భంగా చర్చకు దారి తీశాయి.
ఇల్లెందులో అటవీ భూముల దురాక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కున్న ఓ వ్యక్తి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలకు ఒకటి రెండు రోజుల ముందు అతను కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలిసిందే. పార్టీ టికెట్ కూడా దక్కించుకుని తన కుటుంబం నుంచి ఒకరిని కౌన్సిలర్ గానూ గెలిపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అటవీ భూముల కబ్జా ఆరోపణలు గల వ్యక్తి కుటుంబానికి మున్సిపల్ చైర్మెన్ పదవిని అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తికి పరోక్షంగా అధికార అందలం కల్పిస్తారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. లిక్కర్ సిండికేట్, ఇసుక దందాను నిర్వహిస్తున్న వ్యక్తి కుటుంబానికి మున్సిపల్ పాలక పగ్గాలు అప్పగిస్తే ఇల్లెందు పట్టణంలో పరిస్థితిపై భిన్నవాదనలు వినిపించాయి.

ఈ నేపథ్యంలోనే ‘సమీక్ష’ ప్రచురించిన వార్తా కథనాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రజాప్రయోజనాన్ని కాంక్షిస్తూ, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మున్సిపల్ చైర్మెన్ పదవి అభ్యర్థి ఎంపిక అంశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరైన నిర్ణయం తీసుకోవడం ఇల్లెందు ప్రజల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. అటవీ భూముల ఆక్రమణల అంశంలో గతంలో మంత్రి పొంగులేటి తీసుకున్న కఠిన చర్యలకు అనుగుణంగానే మున్సిపల్ చైర్మెన్ అభ్యర్థి ఎంపిక జరిగిందంటున్నారు.
పార్టీకి విధేయుడైన దొడ్డా డేనియల్ భార్య కిరణ్ మిత్రను చైర్మెన్ పదవికి ఎంపిక చేయడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం ఇల్లెందు ప్రజల అభిమానాన్ని చూరగొందని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ అంశంలో మంత్రి పొంగులేటి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ గా దొడ్డా కిరణ్ మిత్ర, వైస్ చైర్మెన్ గా పెండెల రాజు ఎన్నికయ్యారు. మంగళవారం ప్రమాణ స్వీకారం కూడా చేశారు.

