Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మంత్రి పొంగులేటి సుడిగాలి పర్యటన

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత అశ్వారావుపేటో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. రింగ్ రోడ్డు సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్, బస్టాండ్ శ్రీ శ్రీ కళ్యాణ మండపం వరకు నడుస్తూ, ప్రజలను పలకరిస్తూ మున్సిపాలిటీలో సమస్యలపై ఆరా తీశారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులలో జాప్యం పై ఆర్ అండ్ బి శాఖ అధికారులను వివరణ కోరారు. అనంతరం దొంతికుంట చెరువును పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడితూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులు ఆకాంక్ష మేరకు తెలంగాణ సరిహద్దుల్లోని అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన అశ్వారావుపేటను మెరుగైన మౌలిక వసతులతోపాటు సుందరీకరించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దొంతికుంట చెరువుకు డ్రైనేజీల ద్వారా వచ్చే నీరుని శుద్ధి చేసే విధంగా ప్రణాళికలు ఉన్నాయన్నారు. దొంతికుంట చెరువు చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటుచేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులకు అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

సత్తుపల్లిలో..
ఇందిరమ్మ రాజ్యంలో చొక్కా ఏదైనా ఆఖరికి పింకు చొక్కా అయినా ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ పథకాలు పక్కాగా అందుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేంసూర్ రోడ్డులోని కన్వెన్షన్ హాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన జరిగిన ఇందిరా మహిళా శక్తి సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ప్రతి మాటను తు.చ. తప్పకుండా నెరవేర్చుతామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో మిగులు బడ్జెట్ గల రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. బీఆర్ఎస్ సర్కారు పేదల కోసం కనీసం సన్న బియ్యం పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని, పది సంవత్సరాల్లో 90,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తే, కేవలం 60,000 ఇల్లు మాత్రమే పూర్తి చేశారని తెలిపారు.

పాలేరులో..
ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్నపాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి చేసిన ప్రసంగపు ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

  • పాలేరు నియోజకవర్గంతో తల్లికి కొడుకుకి ఉన్న అవినాభావ సంబంధం నాకు ఉంది.
  • మీ దీవెనలతో 18నెలల క్రితం ఇక్కడి నుంచి కనివివి ఎరుగని మెజారిటీ తో గెలిపించారు
  • రావణాసుర పరిపాలన వద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారు
  • పేదోడికి భరోసా ఇవ్వడంలో ఆనాటి ప్రభుత్వం విఫలమైంది.
  • కానీ పేద వాడి పక్షపాతిగా ఈ 18నెలల నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది.
  • పేదవాడి పక్షపాతిగా ఎలా నడుచుకుంటున్నామో చెప్పడానికే రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తుంది.
  • ఆ నాటి ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టి ప్రోత్సహిస్తే, మీరు ఎంచుకున్న ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులను ఇచ్చింది.
  • రెండు రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తుంగతుర్తిలో ప్రారంభించుకున్నాం.
  • సుమారు 5 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను ఈ ప్రభుత్వం ఇస్తుంది.
  • ఆనాటి ప్రభుత్వం 90వేల ఇల్లు మంజూరు చేస్తే వాటిలో పూర్తి అయినవి కేవలం 60వేలు పైచిలుకు మాత్రమే.
  • అంటే సగటున గడిచిన పదేళ్లలో ఆనాటి ప్రభుత్వం హయంలో ఏడాదికి కేవలం 6వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేశారు.
  • కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడతలోనే ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5లక్షల ఇల్లు ఇవ్వడం జరిగింది.
  • ఇంకా రాబోయే మూడు విడతల్లోనూ అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం.. ఎవరూ కూడా ఇల్లు రాలేదని ఆ భద్రతకు లోను కావొద్దు. పాలేరు నా ఇల్లు ప్రతీ ఒకరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది.
  • కులం చూడం, మతం చూడం, పార్టీలకు అతీతంగా పేదవాడు ఐతే చాలు ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలను అందించే బాధ్యత నాది.
  • రైతుని రాజు చేస్తామని చెప్పి కేవలం పదేళ్లలో రూ.17వేల కోట్ల రుణ మాఫీ చేస్తే మన ప్రభుత్వం కేవలం 10నెలల్లోనే 20వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేసి చూపింది.
  • రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఇలా అన్ని ఇచ్చి రైతును రాజు చేసింది.
  • నిరుద్యోగ యువతకు అన్న మాట ప్రకారం 50వేలకు ఉద్యోగాలు ఇచ్చాం.
  • హాస్టల్ లో మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాం.
  • ఉచిత విద్యుత్, రూ. 500కే వంట గ్యాస్, ఆరోగ్య శ్రీ రూ.10లక్షలకు పెంచింది మన ప్రభుత్వం.
  • కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మన లక్ష్యం.
  • ధాన్యం సేకరణ, ఆర్టీసీ బస్సుల బాధ్యత నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలన్నదే ప్రభుత్వం ధ్యేయం.
  • మహిళా సంఘాల నుంచే ఆడబిడ్డలు ఇందిరమ్మ ఇళ్లు కట్టు కోవడానికి రుణాలు ఇవ్వడం జరిగింది.
  • రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Popular Articles