రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. అర్హులకే ప్రభుత్వ పథకాలు అందుతాయని, ఇందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఒక్క అనర్హుడికి ప్రభుత్వ పథకాలు అందినా మధ్యలోనే ఆపేస్తామని వెల్లడించారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి, ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను మంత్రి పొంగులేటి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రభుత్వ పథకాల పంపిణీ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోనికి అడుగు పెట్టిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నప్పటికీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
గత ప్రభుత్వం దొరికినకాడికి అప్పులు చేస్తూ తెలంగాణ ప్రజలను ఆనాటి ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. రైతన్నల కష్టాలు, యువత బాధలు తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి సెక్టార్ లో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా, అనేక కష్టాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం పేదవాడికి గడిచిన పది సంవత్సరాలలో అద్భుతాలు కాగితాల మీద, టీవీల మీద మాత్రమే చూపించి మాయమాటలతో రెండు సార్లు అధికారంలోనికి వచ్చిందన్నారు. వ్యవసాయానికి యోగ్యమైన భూమికే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎకరానికి 12 వేల రూపాయలు రెండు విడతల్లో ఇచ్చేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ఎక్కడ ఎటువంటి మీటింగ్ పెట్టినా భూములు ఉన్న రైతులకే రైతు భరోసా ఇస్తున్నారని, భూమి లేని నిరుపేద కూలీలమైన మా కుటుంబాల పరిస్థితి ఏంటి అని చాలామంది భూమిలేని నిరుపేద కుటుంబాలు అన్ని వేదికల మీద అడిగిన మాట వాస్తవం అన్నారు. భూమిలేని నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతో ఇబ్బంది పడ్డారని అన్నారు. ప్రజల ఇబ్బందులను గమనించి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఒక ఇంటి ఆడబిడ్డ మరో ఇంటికి కోడలుగా వెళితే ఆ ఆడబిడ్డ ఉన్న ఇంటి యొక్క కార్డులో ఆ పేరు తొలగించి కోడలుగా వెళ్లిన ఇంట్లో ఆడబిడ్డ పేరు కలపడం జరుగుతుందన్నారు.గడచిన పది సంవత్సరాలలో అర్హులైన పేదవాళ్ళకి ఇచ్చే తెల్ల రేషన్ కార్డులను విస్మరించిన గత ప్రభుత్వం..ఈనాడు రాష్ట్రానికి ఎంత భారమైన ప్రతి పేద వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ కార్డుదారులకు రాబోయే రోజుల్లో సన్నబియ్యాన్ని కూడా ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.
అంతేకాకుండా 2014 -2025 వరకు గత ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్హులైన వాళ్ళందరికీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మొదట విడతగా ఈరోజు ఇచ్చుకుంటున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా గ్రామాల్లోకి వచ్చి గ్రామసభలు పెట్టేది కాదు అని, ఆ పార్టీ నాయకులు నాలుగు గోడల మధ్య కూర్చొని వాళ్ల అనుయాయులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేవాళ్ళు అని అన్నారు. మంచి మనసున్న ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల మనసు ఎరిగి పరిపాలించాలని తెలిసిన ప్రభుత్వం కాబట్టి గడిచిన ఐదు రోజుల్లో గ్రామ సభలను నిర్వహించుకున్నామని తెలిపారు. గ్రామసభలలో ఆడబిడ్డలు, అన్నదమ్ములు అప్లికేషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించడానికి చాలా సమయం పడుతున్న కారణంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొదలుపెట్టలేకపోయామని అన్నారు.
ప్రభుత్వ పథకాల కోసం ఎవరు కూడా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, నిష్పక్షపాతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. ఏ రాజకీయ పార్టీ, ఏ మతం, ఏ కులమైనా పరవాలేదు పేదవాళ్లయి ఉంటే చాలు ఎవరికీ రూపాయి ఇవ్వకుండా విస్పక్షపాతంగా ఈ కార్యక్రమాలు మీ ఇంటికి పంపించే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వానిదని అన్నారు. ఏ కారణం చేత అయినా ఏ ఒక్కరికైనా అర్హులుకాని వాళ్ళకి ప్రభుత్వ పథకాలను ఇచ్చినట్లయితే వాటిని మధ్యలోనే తొలగిస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం అని, పేదోళ్ల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.