Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల జాబితాపై పొంగులేటి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా వెల్లడిపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే లబ్ధిదారుల జాబితాను వెల్లడిస్తామన్నారు. హౌసింగ్ కార్పొరేష‌న్ లో అవుట్ సోర్సింగ్ లో నియామ‌క‌మైన 350 మంది అసిస్టెంట్ ఇంజ‌నీర్లు నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ (న్యాక్‌) లో ఆరు రోజుల పాటు శిక్ష‌ణ పొందారు. శ‌నివారం నాడు హైదరాబాద్ లోని న్యాక్‌లో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి శిక్ష‌ణ పొందిన ఇంజ‌నీర్ల‌కు స‌ర్టిఫికెట్ల‌ను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, దేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున రూ. 5 లక్ష‌ల‌తో సంవ‌త్సరానికి నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమేనని అన్నారు. పేదలు ఆత్మ‌గౌర‌వంతో బ‌తకాల‌న్న సంక‌ల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకానికి శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ఈ ఏడాది 22 వేల కోట్ల రూపాయిల‌తో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించ‌బోతున్నామ‌న్నారు. ఇందుకు సంబంధించి మ‌రికొద్దిరోజుల్లో ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తిచేస్తామ‌న్నారు. ఇప్ప‌టికే పైల‌ట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయ‌న్నారు.

ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీ నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేసి పేద‌వాడి చిర‌కాల కోరిక నెర‌వేరుస్తున్న ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కంలో భాగ‌స్వాములు కావాల‌ని అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు మంత్రి ఈ సందర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. ఎంపికైన 350 మంది ఇంజ‌నీర్ల‌లో 45 శాతం మ‌హిళ‌లే ఉండ‌డం సంతోషించ‌దగ్గ విష‌య‌మ‌న్నారు. ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా కూడా మెరిట్ ప‌ద్ద‌తిలోనే ఎంపిక చేశామన్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల కోసం కొద్దిరోజుల్లోనే నాలుగు ల‌క్ష‌ల మంది జాబితా ఫైన‌ల్ చేయ‌బోతున్నామ‌ని, విధుల్లో చేరిన వెంట‌నే అసిస్టెంట్ ఇంజ‌నీర్లు ఈ జాబితాల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు.

ఎలాంటి ప్ర‌లోభాలు, వ‌త్తిళ్ల‌కు గురికాకుండా అర్హుల‌కే ఇందిర‌మ్మ ఇండ్లు ల‌భించేలా క్షేత్ర‌స్ధాయిలో ప‌నిచేయాల‌న్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల చెల్లింపుల్లో ఎలాంటి మ‌ధ్య‌వ‌ర్తులు ప్ర‌మేయానికి ఆస్కారం లేకుండా ఉండేలా అత్యాధునిక‌ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తున్నామ‌ని తెలిపారు. వివిధ ద‌శ‌ల్లో నిర్మాణం పూర్తి చేసుకున్నల‌బ్గిదారుల‌కు ప్ర‌తిసోమ‌వారం చెల్లింపులు చేస్తున్నామ‌న్నారు.

యువ ఇంజనీర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్న మంత్రి పొంగులేటి

నిర్మాణ రంగంలో త‌నకు ఉన్న అనుభ‌వంతో త‌క్కువ ఖ‌ర్చు, నాణ్య‌త‌తో ఇండ్ల‌ను నిర్మించ‌డానికి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశానన్నారు. యువ ఇంజ‌నీర్లు కూడా ఈ అంశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించి ల‌బ్దిదారుల‌కు అవ‌గాహ‌న కల్పించాల‌న్నారు. కాగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో 21 మందికి ప్ర‌భుత్వం ప‌దోన్న‌తులు కల్పించింది. గ్రేడ్ -2లో ప‌నిచేస్తున్న‌10 మంది స‌బ్ రిజిస్ట్రార్ల‌ను గ్రేడ్‌-1కి, సీనియ‌ర్ స‌హాయ‌కులు ప‌నిచేస్తున్న 11 మందికి గ్రేడ్‌-2 ప‌దోన్న‌తులు క‌ల్పించారు. వీరికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప‌దోన్న‌తి స‌ర్టిఫికేట్ల‌ను అంద‌జేశారు.

Popular Articles