Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘కేసీఆర్’పై పొంగులేటి సెటైర్లు

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచ్ లు విసిరారు. వరంగల్ లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో కేసీఆర్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే పొంగులేటి విరుచుకుపడ్డారు. పదేళ్ల పాలనలో.. నియంత.. అంటూ పొంగులేటి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే చదవండి..

ఇప్పటి తరాలకు, ఇప్పటి తెలంగాణ బిడ్డలకు నిజాం కానీ, నియంత కానీ ఎట్లా ఉంటాడో, నియంతృత్వం అంటే ఎలా ఉంటుందో, నియంతల పాలనంటే, గడీల పాలన అంటే ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి వాటిని ఆచరణాత్మకంగా చూపడానికి ఒక పెద్ద మనిషి ప్రయత్నం చేశారు. విజయవంతం అయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ఆ పెద్ద మనిషి నయా నిజాం అయ్యాడు. నియంతలు ఎట్లా ఉంటారో ప్రజలకు పదేండ్లు చూపారు. ప్రజాస్వామ్యం పీక పిసికేశారు. తన తెలంగాణ అంటూనే ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఉద్యమాలను నిషేధించారు. కాదన్నవాడిని కాలికిందేసి తొక్కేశారు. ధరణి పేరుతో భూముల్నే కాదు, ప్రాజెక్టుల్నీ కూడా పన్నుకు మట్టి అంటకుండా మింగేసారు. అవన్నీ నేను మీకు వివరించాల్సిన పనిలేదు. నాకంటే ఎక్కువగా మీరే అనుభవించారు. మీరంతా నయా నిజాం, నయా రజాకార్ల బాధితులే.

మాజీ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

ఆనాడు భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉప-ప్రధాని, హోం మంత్రి శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను పంపి నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే, ఇప్పటి నయా నిజంను ఇంటికి పంపడానికి ఈనాడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, ఇతర కాంగ్రెస్ నాయకులకు ఆ పని అప్పగించింది. వీరంతా వీరోచితంగా పోరాడితే .. డిసెంబరు 7, 2023న నయా నిజాం నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి… ప్రజాపాలన అంటే ఏమిటో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం’గా నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించిదని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఈ ఉత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం.ఎందరో త్యాగధనుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నాం. ఆ త్యాగధనులందరికీ ఘన నివాళులర్పిస్తున్నా… అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Popular Articles