Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

పదవి అధికారం కాదు: మంత్రి పొంగులేటి

ఖమ్మం: పదవిని బాధ్యతగా గుర్తించాలని, అది అధికారం కాదని తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల వరకే రాజకీయమని, గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనప్పటికీ ప్రజా ప్రభుత్వం తరపున పేదవాడికి సేవ చేయాల్సిందేనని కూడా ఆయన స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం నూతన మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, నూతన ప్రజాప్రతినిధులకు తనదైన శైలిలో దిశా నిర్దేశం చేశారు. ప్రజలు నమ్మి ఓటేశారని, కేవలం కుర్చీలకే పరిమితం కాకుండా నిత్యం క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. ప్రతి కౌన్సిలర్ వారంలో ఐదు రోజులు, ఉదయం పూట రెండు గంటలు తప్పనిసరిగా వార్డుల్లో పర్యటించాలన్నారు. ప్రతి పనికి నిధులు అవసరం లేదని, మీరు బాధ్యతగా తిరిగితేనే అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యలు, మురికినీరు నిలవకుండా చూడటం, నాలాల కబ్జాలను అడ్డుకోవడంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పదిహేను రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి ప్రతి వార్డు సమస్యపై కౌన్సిలర్లకు పూర్తి అవగాహన ఉండాలని పొంగులేటి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ , కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Popular Articles