భద్రాద్రి జిల్లాలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే భద్రాద్రి రాముని సన్నిధిలో గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని, అదే భద్రాద్రి నేలపై ఈనెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం జరగడం ఒక చారిత్రక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలంపాడు గ్రామంలో ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో పేదలకు ఇల్లు కలగానే మిగిలిపోయిందన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పునఃప్రారంభించి, మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్ల మంజూరుతో పేదవాడి చిరకాల వాంఛను ఈ పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ శ్రావణ మాసంలో 21వ తేదీన శుభ ముహూర్తంలో ముఖ్యమంత్రి స్వయంగా బెండలంపాడు గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని చెప్పారు.

బెండాలంపాడు గ్రామంలో మొత్తం 312 ఇండ్లు మంజూరు కాగా, వాటిలో 72 ఇండ్లు పూర్తయ్యాయని, అందులో 27 ఇండ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశం జరగనున్నట్లు చెప్పారు. గతంలో ఏ పేదవాడికీ అందని ఇండ్లను ఇప్పుడు ఈ ప్రభుత్వం పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి అర్హునికీ అందజేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇళ్లలో, సుమారు 2.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి చెప్పారు. మిగిలిన ఇళ్లు కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకంగా అర్హులైనవారికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేయడం జరిగిందన్నారు.

జిల్లాలో జరిగే ఈ గృహప్రవేశ మహోత్సవానికి సుమారు ఒక లక్ష మంది ప్రజలు పాల్గొంటారని అంచనాగా చెప్పారు. కాబట్టి కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం నుంచే ఇక్కడ ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని మంత్రి తెలిపారు . అధికారులు చిన్నచిన్న తప్పిదాలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పేదవాడి కలలను నిజం చేసే ఈ గృహప్రవేశోత్సవాన్ని ఘనవిజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, ఈనెల 21 మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రుగొండకు ముఖ్యమంత్రి చేరుకుంటారని, 2:10 బెండలంపాడు చేరుకుంటారని, 2:20గంటలకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని, ఒక్కో ఇంటి వద్ద 15 నిమిషాలపాటు లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 3:00 గంటల నుంచి ప్రజాసభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు.

సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజ్, అశ్వారావుపేట,పినపాక, భద్రాచలం, ఇల్లెందు, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రామదాస్ నాయక్, మట్టరాగమయి, టీజీ ఐ డి సి చైర్మన్ మువ్వా విజయ్ బాబు,అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ట్రైన్ కలెక్టర్ సౌరబ్ శర్మ, స్థానిక సంస్థల ఆదరణ పథకం విద్యాచందన, ఆర్డీవో మధు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.