Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఇవీ కేబినెట్ నిర్ణయాలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణా మంత్రివర్గం తీర్మానించింది. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశపు వివరాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత రాత్రి మీడియాకు వెల్లడించారు.

స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం చర్చించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును కూడా మంత్రివర్గ సమావేశం సమీక్షించింది. గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ప్రధానమైన 23 శాఖలకు సంబంధించి 327 అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఇందులో 321 నిర్ణయాలు అమలు జరగ్గా, మిగిలిన ఆరింటిపై మంత్రిమండలి అవసరమైన వివరణను ఇచ్చింది.

ఇకనుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి విధిగా మంత్రివర్గం సమావేశం కావడమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్ణయాల అమలును సమీక్షించాలని తీర్మానించింది. రాష్ట్రంలోని 306 గోశాలల నిర్వహణపై సమగ్రమైన పాలసీని తీసుకురావాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. చివరి దశలో అసంపూర్తిగా ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

Popular Articles