Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణా కేబినెట్ తాజా నిర్ణయాలు ఇవే..

తెలంగాణా కేబినెట్ సమావేశం గత రాత్రి పొద్దుపోయేవరకు జరిగింది. దాదాపు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబందించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు గత రాత్రి పది గంటల సమయంలో మీడియాకు వెల్లడించారు.

  • తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్న ఆలోచన మేరకు రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో “రైతు నేస్తం” కార్యక్రమం నిర్వహించనుంది.
  • రైతు భరోసా (Rythu Bharosa) విడుదలకు తొలిరోజున ఏవిధంగా రైతు వేదికల ద్వారా లక్షలాది రైతుల సమక్షంలో కార్యక్రమం జరిపినట్టుగానే చివరి చెల్లింపు సందర్భం రోజున కూడా రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో రైతు నేస్తం (Rythu Nestam) కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది.
  • వచ్చే నవంబర్ 9 వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
  • చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కి.మీ పొడవున్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కు ఆమోదం తెలిపింది.
  • గోదావరి నదీ జలాల హక్కుల విషయంలో చుక్క నీరు కూడా వదులుకోవడానికి తెలంగాణా సిద్ధంగా లేదు. గోదావరి జలాలు, అలాగే బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి చట్ట, న్యాయ పరమైన పోరాటం కొనసాగించాలి. బనకచర్ల (Banakacharla) ను అడ్డుకునే విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు చేసిన వాదనల వివరాలను జూలై మొదటి వారంలో ప్రజాప్రతినిధులు అందరికీ వివరించాలని తీర్మానించారు.
  • విభజన చట్టంలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న అంశాలపై సత్వరం ఉన్నతస్థాయి కమిటీలో చర్చించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు.
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్ కోరిన మేరకు నిర్దేశించిన గడువులోగా పూర్తి వివరాలను అందజేయాలని నిర్ణయించారు.
  • 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలతో రూపొందించిన స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది.
  • స్వాతంత్రం వచ్చి వందేళ్లు సమీపించేనాటి సందర్భంగా దేశం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం ౩ ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో రూపొందించిన విజన్ 2047 కు ఆమోదం తెలిపింది.
  • రాష్టంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధి పరచాలని సంకల్పించిన నేపథ్యంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడానికి ఆమోదం తెలిపింది.
  • సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జన్నారంలను మున్సిపాలిటీలుగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్‌గ్రెడేషన్‌కు ఆమోదం తెలిపింది.
  • శాతవాహన యూనివర్సిటీలో 60 సీట్ల చొప్పున ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల ప్రారంభం. మహబూబ్‌నగర్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి IIIT కి శ్రీకారం, హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు ఆమోదం తెలిపింది.
  • మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై ఇకనుంచి ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమీక్షించాలని తీర్మానం చేశారు.
  • రైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు రైతుల పక్షాన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేశారు.

Popular Articles