తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జ్ఞాపకశక్తి ఎక్కువ. తనకు మేలు చేసినవారినీ, కీడు చేసినవారినీ ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కాస్త సాన్నిహిత్యం ఉన్నవారెవరికైనా ఈ విషయం బాగా తెలుసు. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పొంగులేటి భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాదు, రాజకీయాల్లో ప్రవేశించిన దశాబ్ధ కాలంలోనే ప్రభుత్వంలో కీలక నాయకునిగా ఎదిగారంటే ఆయన జ్ఞాపకశక్తి సైతం ఇందుకు దోహదపడిందనే చెప్పక తప్పదు. ఇప్పుడిదంతా ఎందుకంటే..
రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోట్లు కుమ్మరించడానికి రెడీగా ఉన్నారని, ప్రభుత్వాన్ని కూల్చాలని తమను అడుగుతున్నారనే సారాంశంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆత్మగా పొంగులేటి అభివర్ణించారు. అయితే ఇదే సమయంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు పొంగులేటికి స్ఫురణకు రాకపోవడం గమనార్హం. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పక్కనే గల ఎమ్మెల్యేలను ‘కేసీఆర్ గారి నియోజకవర్గం ఏదీ..?’ అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. గజ్వేల్ గా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పొంగులేటికి గుర్తు చేశారు.

వాస్తవానికి పొంగులేటికి, కేసీఆర్ కు గల రాజకీయ అనుబంధం సాధారణమైనదేమీ కాదు. వైఎస్ఆర్ సీపీ తరపున 2014 ఎన్నికల్లో ఎంపీగా గెల్చిన పొంగులేటి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానంతరం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో ఆయన వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షునిగానూ ఉన్నారు. అప్పటి నుంచి 2023 జనవరి వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగారు. తాను సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ నిరాకరించినా, దాదాపు ఐదేళ్లపాటు ఓపిగ్గా అదే పార్టీలో కొనసాగారు.
అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పొంగులేటి 2023 జూలై 2వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాల్లో పొంగులేటి కీలక శపథం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులెవరినీ అసెంబ్లీ గేట్ తాకనివ్వనని శపథం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయానికి, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు పొంగులేటి వేసిన పొలిటికల్ అడుగు కీలకంగా మారిందనేది అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్ పేరు పొంగులేటికి గుర్తు లేకపోవడమేంటి? గుర్తుకు రాకపోవడమేంటి? అనే ప్రశ్నలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. యథాఫలంగానే గుర్తుకు రాక కేసీఆర్ నియోజకవర్గమేంటి? అని అడిగారా? లేక తనకు రాజకీయంగా తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ పై పొంగులేటి ‘పంచ్’ విసిరారా? అనేది ఆ చర్చకు సంబంధించిన సారాంశం.