తమ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం దేశానికే మణిహారం వంటిదని తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలోని పద్ధెనిమిది రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ చట్టం ప్రజలకు, ముఖ్యంగా రైతులకు చుట్టంలా పనిచేస్తుందని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూభారతి సర్వే పైలట్ ప్రారంభ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, ఒక చట్టాన్ని అమలు పరిచేటప్పుడు ముందుగా దాని విశ్లేషణ కోసం నాలుగు మండలాలు పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నట్లు చెప్పారు. ఈ రోజు నుంచి ప్రతి రెవెన్యూ విలేజ్ లో మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారని, ఏ కార్యాలయం చుట్టూ రైతులు తిరగకుండా చేస్తున్నామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15న ధరణి నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. తద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలకు చెప్పారు.

అదేవిధంగా రాష్ట్రంలో 413 రెవెన్యూ గ్రామాల్లో నక్షలు లేవని, అయిదు గ్రామాలను సర్వే చేసేందుకు ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్ట్ లుగా అయిదు సంస్థలకు ఇచ్చామన్నారు. తాము గత ప్రభుత్వంలో మాదిరిగా ఒక్కరికే ఇవ్వలేదన్నారు. ములుగుమాడుకు ఒక్క నక్ష తయారు చేసి ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనల్లో భూమి లేకుండానే ఉన్నట్లుగా చిత్రీకరించారు ఆ నాటి ప్రభుత్వం నేతలు.. అని మంత్రి పొంగులేటి అన్నారు. రైతు బంధు కోసం పెద్దల సహకారంతో అక్రమాలు చేశారని, ధరణి పేరుతో అక్రమంగా ఆనాడు ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇచ్చిన భూములను తారు మారు చేశారన్నారు.

ప్రతీ రైతుకూ భూధార్ నెంబర్ ఇస్తామన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ లను ఇస్తామని, ప్రతీ రెవెన్యూ విలేజ్ కి ఓ వీఆర్వోను ఇస్తామని, 3,556 మంది వీఆర్వోల నియామకం జరుగనున్నట్లు చెప్పారు. రైతుల భూములకు రెవెన్యూ అధికారి కాపలాదారుడుగా ఉంటారని చెప్పారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా మార్పులు చేస్తున్నామని, స్లాట్ బుకింగ్ పెట్టి పారదర్శకంగా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

